బ్రేకింగ్: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ నియామకం
By సుభాష్ Published on 31 July 2020 7:42 AM ISTఏపీలో సంచలన సృష్టించిన నిమ్మగడ్డ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.
రమేష్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్దరణ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.
కాగా, ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డను సీఈసీగా తిరిగి నియమిస్తూ గవర్నర్ ప్రకటన జారీ చేశారు.
గురువారం ఉదయం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టే కోరుతూ జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్ కు నిమ్మగడ్డ సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టుల ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న చర్యలు ధిక్కరణ నిదర్శనంగా ఉన్నాయని ఆరోపించారు.