ఢిల్లీ: నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

By సుభాష్  Published on  24 July 2020 8:21 AM GMT
ఢిల్లీ: నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

ఏపీలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విషయంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ తరపున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు వచ్చినందుకు స్టే ఇచ్చేందుకు కుదరదని, కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీశ్‌ సాల్వే కోర్టుకు వివరించారు. అలాగే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ సోషల్‌ మీడియాలో ఇష్టరీతిన కామెంట్లు కూడా చేసినట్లు ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం మాకు తెలుసు. మేం కావాలని ఈ కేసులో స్టే ఇవ్వడం లేదు.. గవర్నర్‌ లేఖ పంపినా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం దారుణమని సీజేఐ వ్యాఖ్యనించారు. గతంలో కూడా నిమ్మగడ్డ విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Next Story
Share it