కరోనా నుండి నికోటిన్ కాపాడుతోందా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 April 2020 5:15 AM GMT
కరోనా నుండి నికోటిన్ కాపాడుతోందా..!

పారిస్, ఫ్రాన్స్: కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటికే అగ్రరాజ్యాలన్నీ కుదేలయ్యాయి. ఎప్పుడు ఏ ప్రాంతంలో వైరస్ విలయతాండవం చేస్తుందో అని ప్రభుత్వాలన్నీ ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ ప్రభావం నుండి నికోటిన్ కాపాడుతుందని అంటున్నారు.

కరోనా వైరస్‌ సోకకుండా దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి పొగాకులోని నికోటిన్‌కు ఉందని ఫ్రాన్స్ లో చేసిన రీసర్చ్ ద్వారా తేలింది. మేజర్‌ పారిస్‌ ఆస్పత్రిలో జరిపిన పరిశోధనల్లో పొగాకులోని నికోటిన్‌ కరోనా సోకకుండా అడ్డుపడుతున్న విషయం స్పష్టంగా తేలిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. నికోటిన్‌ సెల్‌ రెసెప్టార్స్‌ను అంటిపెట్టుకుని ఉండటం వల్ల శరీరంలో వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటోందని అన్నారు.

కరోనా చికిత్స నిమిత్తం చేరిన 343 మందితో పాటు, స్వల్పంగా వైరస్ లక్షణాలున్న 139 మందిని పరిశీలించామని అధ్యయనకర్తల్లో ఒకరైన జహీర్ అమౌరా తెలిపారు. ఫ్రాన్స్ లో 35 శాతం మంది ప్రజలు స్మోకర్లేనని, ఆ నిష్పత్తి ప్రకారం, పొగతాగే వారిలో 150 మందికి పైగా వ్యాధి సోకాలని, కానీ అది జరుగలేదని జహీర్ అమౌరా అన్నారు. వీరిలో కేవలం ఐదు శాతం మాత్రమే పొగతాగే వారున్నారు. న్యూజిలాండ్ కు చెందిన ఓ స్టడీలో కూడా ఇలాంటి ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు ఆయన అన్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం చైనాలోని కార్మికుల్లో 26 శాతం మంది స్మోకింగ్ కు అలవాటు పడిన వారే.. వైరస్ సోకిన వారిలో 12.6 శాతం మంది మాత్రమే పొగతాగే వారున్నారని తెలిపారు. పారిస్‌లో కరోనాతో ఆస్పత్రిపాలైన 11 వేల మంది రోగుల్లో 8.5 శాతం మంది స్మోకర్లు కాగా... దేశవ్యాప్తంగా వీరి సంఖ్య 25.4 శాతంగా ఉంది. నికోటిన్‌ తీసుకునే వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

నికోటిన్ కు మానవ శరీరంలో ఉండే కణ గ్రాహకాలను పట్టుకుని ఉండే లక్షణాలు ఉన్నాయని.. కరోనా సూక్ష్మజీవిని కూడా అలాగే పట్టుకుని ఉంటుందని.. ఇతర శరీరభాగాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని న్యూరోబయాలజిస్ట్ జీన్ పెయిరీ చాంగ్యుక్స్ తెలిపారు. ఆరోగ్య శాఖ నుంచి ఆమోదం లభిస్తే పేషెంట్లతో పాటు వైద్య సిబ్బందికి కూడా నికోటిన్‌ ప్యాచులు(నికోటిన్‌ నింపిన బ్యాండేజ్‌ వంటి అతుకు) ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నికోటిన్ 'సైటోకిన్'ను అడ్డుకోగలదో లేదో కూడా పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు.

నికోటిన్ వలన శరీరానికి ఎంతో నష్టం కలుగుతూ ఉంటుంది.. ఇలాంటి రీసర్చ్ కారణంగా నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు నికోటిన్ వైపు మొగ్గు చూపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. నికోటిన్ కలిగించే శారీరక రుగ్మతలను ఎవరూ మరువరాదని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరించారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా నమోదయ్యే మరణాల్లో 75 వేలు పొగాకు వాడకం కారణంగా నమోదయ్యేవేనట..!

ఇప్పటికే ఫ్రాన్స్ లో నికోటిన్ మరణాలు ఎక్కువ.. ఇటువంటి సమయంలో ధూమపానం చేసే వారి సంఖ్య మరింత పెరిగితే చాలా నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. పరిశోధనలు జరిగి ఓ నిర్ణయానికి వచ్చేంత వరకూ ప్రజలు కొత్తగా పొగ తాగడానికి అలవాటు పడకూడదని తెలిపారు. నికోటిన్ ప్యాచ్ లను వాడితే, కరోనా సోకదని కూడా భావించరాదని అంటున్నారు.

Next Story