కరోనాతో మరో నటుడు మృతి

By రాణి  Published on  6 July 2020 4:02 PM IST
కరోనాతో మరో నటుడు మృతి

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. కాస్త బలహీనంగా ఉన్నవారికి ఈ వైరస్ సోకితే వారు కోలుకోవడం చాలా కష్టతరమవుతుంది. ఎంత డబ్బున్నా కరోనా బారి నుంచి ప్రాణాలు దక్కించుకోలేక పోతున్నారు. రెండ్రోజుల క్రితం ఈతరం ఫిలింస్ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మృతి చెందిన సంగతి విధితమే. బాలీవుడ్ కు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కూడా కరోనాతో మృతి చెందారు. అంతకుముందు అమెరికాకు చెందిన ఇద్దరు సింగర్లు సైతం కరోనాతోనే కన్ను మూశారు. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకగా ఇటీవలే కోలుకుని ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో (41) కరోనాతో 90 రోజుల సుదీర్ఘ పోరాటం అనంతరం మృతి చెందారు. ఏప్రిల్ మొదటి వారంలోనే నిక్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో లాస్ ఏంజిల్స్ లో గల సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. రెండు నెలలు గడిచాక అతని కుడికాలిలో రక్తం గడ్డ కట్టడం గమనించిన వైద్యులు..తప్పనిసరిగా ఆపరేషన్ చేసి ఆ కాలును తొలగించారు. అప్పటి నుంచి నిక్ ఆరోగ్య పరిస్థితిలో ఊహించని మార్పులొచ్చాయి. ఆఖరికి జులై 5, ఆదివారం అతను తుదిశ్వాస విడిచారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 11.4 మిలియన్ల కరోనా కేసులు నమోదవ్వగా..మరణాల సంఖ్య 5 లక్షల 40 వేలకు పెరిగింది. 6.16 మిలియన్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది.

Next Story