విచారణ పేరుతో మమ్మల్ని వేధించకండి..దిశ తల్లిదండ్రులు
By Newsmeter.Network
దిశ ఘటనపై జాతీయ మావన హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. మరింత విచారణ కోసం బాధితురాలి కుటుంబ సభ్యులను జాతీయ మానవ హక్కుల సంఘం ఆహ్వానించింది. వారి వాంగ్మూలం నమోదు చేసుకొనేందుకు పిలిపించగా , అందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు పోలీసులు నచ్చజెప్పి విచారణకు ఒప్పించారు. ఈ మేరకు దిశ సోదరి, తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి వెళ్లారు. కాగా, ఆదివారం సాయంత్రం ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుల ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు సమాచారం అందించగా, దిశ దశ దిన కర్మ ఉండడమే కాక, ఆమె తల్లి ఆరోగ్యం బాగా లేనందున తమను ఇబ్బంది పెట్టవద్దని దిశ కుటుంబీకులు కోరారు. పోలీసులు విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని దిశ తల్లిదండ్రులు ఆరోపించారు. దిశ కుటుంబీకుల విచారణపై కాలనీ వాసులు సైతం వ్యతిరేకించారు. దిశ కుటుంబీకులకు మద్దతుగా నిలిచి , ఎన్‌హెచ్‌ఆర్సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి:
తమ కూతురు చనిపోయినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, తాము ఇంత విషాదంలోఉండగా, విచారణ పేరుతో తమకు ఈ ఇబ్బందులేంటని వారంటున్నారు. తమ కూతురు పోయినప్పటి నుంచి ఆరోగ్యాలు సరిగ్గా ఉండటం లేదని, పోలీసులు, ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుల కారణంగా మరింత ఆరోగ్యం కుంగిపోయే అవకాశం ఉందని, విచారణకు వచ్చి మాట్లాడేంత ఒపిక కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కూతురు మృతితో దుంఖంలో ఉంటే , మరో వైపు వీరి వేధింపులు ఎక్కువయ్యాయని దిశ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కొద్దిసేపటికి పోలీసులు దిశ తల్లిదండ్రులకు నచ్చ చెప్పి, విచారణకు వచ్చేందుకు ఒప్పించారు. దీంతో దిశ సోదరి సహా తల్లిదండ్రులు పోలీసులు సమకూర్చిన ప్రత్యేక వాహనంలో విచారణకు బయలుదేరారు. ఈ విచారణ గంటపాటు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు ముందు నలుగురు నిందితులు పోలీసులపై దాడికి దిగడంతో, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ను గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే. కాగా, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పోలీసులను కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ మరోసారి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రమే కేర్ ఆసుపత్రికి వెళ్లి వారిని విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. వీరి వాంగ్మూలం కూడా రికార్డు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.