విశాఖ ఘటన: కేంద్రానికి, ఏపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

By సుభాష్  Published on  7 May 2020 12:08 PM GMT
విశాఖ ఘటన: కేంద్రానికి, ఏపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన రసాయన వాయువు లీకేజీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. గ్యాస్‌ లీకేజీ వల్ల 10 మంది వరకూ మృతి చెందడం, 2వేలకు పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రసార మాధ్యమాల్లో గమనించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలంటే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఈ గ్యాస్‌ సుమారు ఐదు కిలోమీటర్ల వరకూ వ్యాపించింది. గ్యాస్‌ లీక్‌ కావడంతో గాలి పీల్చిన వారు ఎక్కడికక్కడే తీవ్ర అస్వస్థతకు గురి కావడం టీవీల్లో ప్రసారం అయ్యాయి. అయితే ప్రాథమిక అంచనా మేరకు ఈ ఘటనలో మానవ తప్పిదం ఏది లేదని కమిషన్‌ భావిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.

ఈ ఘటనపై సమగ్ర వివరాలతో పాటు బాధితులకు , వారి కుటుంబాలకు అందిన సాయం, తదితర వివరాలను పంపాలని ఏపీ సీఎస్‌కు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

అలాగే ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి నాలుగు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఏపీ డీజీపీకి కూడా మరో నోటీసులు పంపింది. ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకురావడం సముచితమని భావించింది.

Next Story