క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ మే 3 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఏప్రిల్ 20 నుంచి కేంద్రం కొన్నింటిని మిన‌హాయింపు నిచ్చింది. దీంతో.. అంతర్‌రాష్ట్ర సరుకుల రవాణా ఇంకా సులభతరం కానుంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న ర‌హ‌దారుల‌పై ఏప్రిల్ 20 నుంచి టోల్ ట్యాక్స్‌లు వ‌సూలు చేయాల‌ని ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా)కి కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర సేవ‌ల‌పై భారాన్ని త‌గ్గించ‌డం కోసం టోల్ వ‌సూలును నిలిపివేయాల‌ని మార్చి 25న కేంద్రం ప్ర‌క‌టించింది. తాజాగా అంత‌ర్ రాష్ట్రాల ప‌రిధిలో ట్ర‌క్కులు, స‌రుకు ర‌వాణా వాహానాలు తిర‌గ‌డానికి వీలుగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన స‌డ‌లింపుల‌ను అమ‌లు చేయ‌డానికి ఎన్‌హెచ్ఏఐ చ‌ర్య‌లు తీసుకోవాలి. ఏప్రిల్ 20 నుంచి టోల్ వ‌సూలును మొద‌లుపెట్టాల‌ని అని కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఐకి లేఖ రాసింది.

కాగా.. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎమ్‌టీసీ ) కోరింది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ర‌వాణా కొన‌సాగించ‌డానికి అనేక‌ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ట్ర‌క్కుల య‌జ‌మానులు ప‌నిచేస్తున్నార‌ని, ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో డ్రైవ‌ర్ల‌ను తీసుకురావ‌డం పెద్ద స‌వాలుగా మారింద‌న్నారు. ర‌వాణా రంగం కుదేలైంది. ఈ ప‌రిస్థితుల్లో టోల్ ను వ‌సూలు చేయ‌డం స‌రికాద‌ని, ఈ రంగాన్ని ఆదుకోవాల‌ని ఏఐఎమ్‌టీసీ పేర్కొంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.