క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. రోజుకు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే చాలా దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో అయితే.. ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. అక్క‌డ న‌మోదైన కేసుల సంఖ్య 7 ల‌క్ష‌లు పైనే ఉంది.

ప్ర‌పంచలో ఎక్క‌డా న‌మోదు కాన‌న్ని కేసులు, మ‌ర‌ణాలు అమెరికాలో న‌మోద‌వుతున్నాయి. ప‌రిస్థితి చూస్తేంటే.. అమెరికా ఇంకా పెను స‌వాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందేమో.. ఇక శుక్ర‌వారం అర్థ‌రాత్రి వ‌ర‌కు అక్క‌డ 7,06,310 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 36,607 మంది మృత్యువాత ప‌డ్డారు. స‌గ‌టున రోజుకు 1500 మందికి పైగా మృతి చెందుతున్నారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 58,478 మంది కోలుకున్నారు. ఇక రెండో స్థానంలో ఇట‌లీ ఉంది. 1,72,434 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 22,745 మంది మ‌ర‌ణించారు.

భార‌త్‌లో 14వేల కేసులు

ఇక భార‌త్‌లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగోతంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 43 మంది మ‌ర‌ణించ‌గా.. 991 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14,378 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా.. 480 మంది మృత్యువాత ప‌డిన‌ట్లు కేంద్ర కుటంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో 1992 మంది కోలుకున్నారు.

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. ఇక్క‌డ మృతుల సంఖ్య 201కి చేరింది. గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 118 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,323కి చేరింది. ఢిల్లీలో 1,707కేసులు న‌మోదు కాగా.. 42 మంది మ‌ర‌ణించారు. త‌మిళ‌నాడులో 1,323, రాజ‌స్థాన్‌లో 1,229, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 1,310, గ‌జ‌రాత్ 1,099, తెలంగాణ 766, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 572 కొవిడ్-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.