ఆ విధ్వంసక వీరుడు ఇకలేడు
By తోట వంశీ కుమార్ Published on 6 April 2020 12:43 PM GMTవిధ్వంసకర న్యూజిలాండ్ పాతతరం క్రికెటర్ జాక్ ఎడ్వర్డ్స్ ఇక లేరు. సోమవారం ఆయన కన్నుమూశారని సెంట్రల్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 1974-85 మధ్య కాలంలో ఎడ్వర్డ్స్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. కివీస్ తరుపున ఆరు టెస్టులు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఫస్టు క్లాస్ క్రికెట్‌లో 64 మ్యాచ్‌లు ఆడాడు. పాతతరంలో విధ్వంసకరంగా ఆడిన ప్లేయర్లలో ఎడ్వర్డ్స్ ఒకరు.
నాలుగేళ్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన బ్యాటింగ్ విన్యాసాలతో విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011లో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేటి టీ20లకు తన క్రికెట్ సరిపోతుందనే విషయాన్ని తెలిపారు. తనకు హిట్టింగ్ అంటే ఇష్టమన్నాడు. తన ఆటతీరును మార్చాలని కోచ్‌లు ఎంతో ప్రయత్నించారని, అయితే తన సహజసిద్ధమైన ఆటతీరుకే కట్టుబడ్డానని ఎడ్వర్డ్స్ తెలిపారు. ఇక 1978లో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీలు చేసి, ఆ మ్యాచ్ డ్రా కావడంలో కీలకపాత్ర పోషించారు.ఎడ్వర్డ్స్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను, వన్డే మ్యాచ్‌ను భారత్‌పైనే ఆడటం గమనార్హం.