తెలంగాణ కొత్త సచివాలయానికి స్ఫూర్తి ఆ మహా భవనమేనట

By సుభాష్  Published on  8 July 2020 11:47 AM IST
తెలంగాణ కొత్త సచివాలయానికి స్ఫూర్తి ఆ మహా భవనమేనట

తనకు నచ్చనిది ఏదైనా సరే.. ఎంతవరకైనా వెళ్లి.. అనుకున్నది చేసే అలవాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా సచివాలయాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాలన్న విషయంలో తన పట్టును సాధించుకుంటున్న విషయం తెలిసిందే. వాస్తు బాగోలేదన్న కారణంగా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది నిర్మిస్తున్న వైనంపై విరుచుకుపడుతుంటే.. అలాంటిదేమీ లేదని.. భవనం పాతది కావటం.. వసతులు సరిగా లేకపోవటం కారణంగానే కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే.

కోర్టు చిక్కులు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో తాజాగా పాత సచివాలయాన్ని కూల్చేసే ప్రక్రియను విజయవంతంగా షురూ చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొత్త సచివాలయం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తూ అందుకు తగ్గ నమూనాను విడుదల చేశారు. భారీగా ఉన్న ఈ నిర్మాణం గ్రాండ్ గానే కాదు.. రాజఠీవిని ఉట్టిపడేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. కొత్తగా నిర్మించే సచివాలయానికి స్ఫూర్తి ఏమిటన్న విషయంపై ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణానికి స్ఫూర్తి ప్రాన్స్ కు చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ గా చెబుతున్నారు. 16వ శతాబ్దంలో నిర్మించిన రాజసౌథం కొత్త సచివాలయానికి స్ఫూర్తి అని చెబుతున్నారు. 1623లో రాజు లూయిస్ 13 ఈ ప్యాలెస్ ను నిర్మించారు. అద్భుతమైన కళాత్మకతో నిర్మించిన రాజసౌథాన్ని నేటికి వందలాది మంది నిత్యం సందర్శిస్తుంటారు. వర్సైల్స్ గ్రామ సమీపంలో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో ఏకంగా 700 గదులు ఉన్నాయి. నాటి ఫ్రెంచ్ విప్లవానికి ప్రత్యక్ష సాక్షిగా చెప్పే ఈ భవనం.. తర్వాత కూడా ఎన్నోచారిత్రక ఉదంతాలకు వేదికగా చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధం అధికారిక ముగింపు ఒప్పందం 1919 జూన్ 28న ఈ ప్యాలెస్ లోని హాల్ ఆఫ్ మిర్రర్స్ లో జరగటం గమనార్హం.

Next Story