టీమిండియాను ఓడించినందుకు.. కివీస్ కు ఐసీసీ షాకిచ్చింది
By Newsmeter.Network Published on 9 Feb 2020 6:57 AM GMT
శనివారం ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఆనందం కివీస్‌కు ఎంతో సేపు మిగల లేదు. ఆ జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ లో 60శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. రెండో వన్డేలో కివీస్ నిర్ణీత సమయానికి మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60శాతం కోత విధించారు. కెప్టెన్ టామ్ లేథమ్ ఈ శిక్షను అంగీకరించడంతో.. ఈ విషయం పై తదుపరి ఎలాంటి విచారణ ఉందని ఐసీసీ తెలిపింది.
కాగా వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లో, మౌంట్‌మాంగనీలో జరిగిన చివరి ఐదో టీ20 లో, హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ టీమిండియా ఇదే కారణంగా ఫీజులో కోత ఎదుర్కొంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా ఛేదనలో టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులకే కుప్పకూలిపోయింది.