అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ ముందు బంగ్లా నిలిచేనా..?
By Newsmeter.Network Published on 9 Feb 2020 5:27 AM GMT
ఇప్పటికే నాలుగు సార్లు విజేతగా నిలిచిన జట్టు ఓ వైపు.. ఇప్పటి వరకు కనీసం ఏ స్థాయిలో కూడా ప్రపంచ కప్ లో కనీసం ఫైనల్ కు చేరుకుని జట్టు మరో వైపు.. ఇక ఈ టోర్నీలో రెండు జట్లు కూడా ఓటమి ఎగురకుండా ఫైనల్ చేరుకున్నాయి. దక్షిణాప్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ నేడు జరగనుంది.
నాలుగు సార్లు విశ్వవిజేత..
యువ భారత్ ఇప్పటి వరకు నాలుగు సార్లు అండర్-19 ప్రపంచ కప్ ను ముద్దాడింది. నేడు జరిగే ఫైనల్ లో బంగ్లాదేశ్ పై గెలిచి ఐదవ సారి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాలని యువ భారత్ భావిస్తోంది. భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. భారత్ జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిలకడగా రాణిస్తున్నాడు. పాక్‌పై అజేయ శతకం బాది ఒంటిచేత్తో టీమ్‌ని గెలిపించిన ఈ యువ హిట్టర్ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడి 312 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ తో పాటు దివ్యాన్షు సక్సేనా, తిలక్‌వర్మ, కెప్టెన్ ప్రియం గార్గ్ లు పైనల్ మ్యాచ్ లో బ్యాట్ ఝళిపిస్తే బంగ్లాదేశ్ కు కష్టాలు తప్పవు. భారత బౌలర్లలో బిష్ణోయ్ (13), కార్తీక్ త్యాగి (11) లు ప్రత్యర్థి నడ్డి విరచడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే ఏడుసార్లు వరల్డ్‌కప్ ఫైనల్‌కి చేరిన భారత అండర్-19 జట్టు.. నాలుగు సార్లు టైటిల్ గెలిచి.. రెండు సార్లు రన్నరప్‌తో సరిపెట్టింది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ రికార్డుల్ని ఒకసారి పరిశీలిస్తే.. 2000, 2006, 2008, 2012, 2016, 2018లో ఫైనల్‌కి చేరింది. ఈ ఆరు సందర్భాల్లో కేవలం రెండు సార్లు (2006, 2016) మాత్రమే ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? వరుసగా రెండు సార్లు టీమిండియా ప్రపంచ కప్‌ను గెలవలేదు. ఈ సారి గెలిచి ఆ అపప్రదని చెరిపేయాలని ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలోని భారత యువ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
ఇక ప్రపంచ కప్ లో రెండు జట్లు చివరిసారిగా 2018 క్వార్టర్‌ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో భారత్-బంగ్లా ఏడుసార్లు పరస్పరం తలపడ్డాయి. వీటిల్లో రెండు మ్యాచ్‌లు రద్దుకాగా.. మిగిలిన మ్యాచ్‌ల్లో నాలుగింటిని భారత్, ఒకటి బంగ్లాదేశ్ నెగ్గాయి. ఆ ఐదు మ్యాచ్‌లూ హోరాహోరీగా జరగడం గమనార్హం. 2018 ఆసియా కప్ సెమీ్‌సలో కేవలం రెండు పరుగుల తేడాతో, 2019 ఆసియా కప్ అంతిమ సమరంలో ఐదు పరుగులతో భారత్ గెలుపొందింది. చివరిసారి గత జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా రెండు వికెట్లతో నెగ్గింది. ఫైనల్లో రెండు జట్లు ఒత్తిడికి లోను కాకపోతే పోరు ఉత్కంఠ రేకెత్తించడం ఖాయం.
వర్షం అడ్డంకి..?
ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే మ్యాచ్‌ను రిజర్వ్ డే సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజుకూడా సాగకపోతే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సెమీ్‌సలో ఆడిన జట్లతోనే భారత్, బంగ్లాదేశ్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.