ఇది కదా స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌..

By Newsmeter.Network  Published on  30 Jan 2020 1:17 PM GMT
ఇది కదా స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌..

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో కివీస్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌ లీగ్‌ క్వార్టర్‌ ఫైనల్‌-2లో న్యూజిలాండ్‌ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 47.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ కాగా.. 239 పరుగుల ల‌క్ష్యాన్ని కివీస్ రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

టాస్ గెలిచిన వెస్టిండిస్ కు శుభారంభం ద‌క్క‌లేదు. అయితే.. క్రిక్‌ మెకెన్జీ (99; 104 బంతుల్లో 11×4, 3×6) అద్భుత పోరాటం చేశాడు. కెల్వన్‌ అండర్సన్‌ (33; 46 బంతుల్లో 4×4)తో కలిసి 78 పరుగుల భాగస్వామ్యం అందించాడు. సెకండ్‌ డౌన్‌లో వచ్చిన కిర్క్‌ మెకంజీ కుడి కాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో సతమతమయ్యాడు. ఈ క్రమంలోనే 99 పరుగుల వద్ద ఉండగా రిటర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 43 ఓవర్‌ చివరి బంతికి పెవిలియన్‌ వీడాడు. కాగా, విండీస్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన మెకంజీ 99 పరుగుల వద్దే ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. మళ్లీ స్టైకింగ్‌కు వచ్చి ఆడిన తొలి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. దాంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ 13 బంతులు ఉండగా ముగిసింది. కివీస్‌ బౌలర్లు ఆఖరి 5 వికెట్లను 22 పరుగుల వ్యవధిలో పడగొట్టారు.

మెకెన్జీ ఔటయ్యాక న్యూజిలాండ్‌ ఆటగాళ్లంతా అతడి వద్దకు వెళ్లి అభినందించారు. అత‌డి పోరాట పటిమను మెచ్చుకున్నారు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో ఇబ్బంది పడ్డాడు. నడవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించి కివీస్‌ ఆటగాళ్లు ఇద్ద‌రు అతడిని చేతుల్లో ఎత్తుకొని బౌండ‌రీ లైన్ వ‌ర‌కు వరకు మోసుకెళ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. దీనిపై టీమిండియా ఆటగాడు హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ తన ట్వీటర్‌ అకౌంట్‌లో ‘ఇది కదా స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అంటూ పోస్ట్‌ చేశాడు. ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నాడు. వారిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.Next Story
Share it