ఏడేళ్లుగా సాగిన నిర్భయ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకు వచ్చింది. దోషులైన నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ  పటియాల కోర్టు ఇటీవల తీర్పు ఇవ్వగా, దోషుల్లో ఒకరైన ముఖేష్‌సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఆ పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు ఉరిశిక్ష వేయాలంటూ కోర్టు వెల్లడించింది. మనదేశంలో ఎంత పెద్ద కేసు అయినా..విచారణ ఎంత వేగవంతం చేసినా.. నిందితులకు శిక్ష అమలులో ఆలస్యమనే చెప్పాలి. అందుకు ఉదాహరణ నిర్భయ కేసు. ఏడేళ్లు సాగిన విచారణ.. తాజాగా నలుగురు దోషులైన అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్త, ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మలకు ఫిబ్రవరి 1న, ఉదయం ఆరు గంటలకు ఉరిశిక్ష వేస్తారా..? అనే అనుమానాలు లేకపోలేదు. కాగా, దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా చేస్తున్న వాదనలు శిక్ష ఖరారుకు అడ్డంకిగా మారుతోంది. నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్‌ అని, తనకు బాల నేరస్థులకు విధించే శిక్ష విధించాలని కోరుతున్నాడు. అప్పట్లో వైద్య పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదని, తనకు జువెనైల్‌ చట్టం ప్రకారం మూడేళ్లే జైలు వేయాలని సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేస్తున్నాడు.

గత ఏడాదే పిటిషన్‌ కొట్టివేత

నిర్భయపై జరిగిన అత్యాచారంలో తాను మైనర్‌ అని పవన్‌ గుప్తా పెట్టుకున్న పిటిషన్‌ను గత ఏడాది ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. తాను అమాయకుడినని, తనకు ఉరివేయడం సరైంది కాదని చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పుడు దోషి పవన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తే అనుకున్నట్లు ఫిబ్రవరి 1న నలుగురికి ఉరిశిక్ష అమలవుతుంది. లేకపోతే పిటిషన్ ను విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే .. శిక్ష అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.