కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్
By సుభాష్ Published on 2 Nov 2020 1:21 PM GMTసోమవారం ఉదయం కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్‌ను రెండు కార్లు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు తమిళనాడు ఎర్రచందనం స్మగ్లర్లు మృత్యువాత పడటం వెనుక పరిణామాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు స్మగ్లర్లు కడప జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగ్ వెంటాడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఈ ప్రమాదంలో మరి కొందరు తీవ్రంగా గాయపడగా, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అతివేగంతోనే ప్రమాదం
ఈ ప్రమాదంలో రెండు కార్లు స్కార్పియోలో ఉన్న నలుగురు స్మగ్లర్లు సజీవదహనం కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరు మృతి చెందారు. స్కార్పియో వాహనంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు ఎర్రచందనం దుంగలు కూడా ఉన్నాయి. వీరంతా కడప జిల్లా అడవుల్లో చెట్లను నరికి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగ్ వారి వాహనాలను వెంబడించారు. తెల్లవారుజామున ఎర్రచందనాన్ని తరలిస్తున్నారని హైజాక్ గ్యాంగ్‌కు సమాచారం అందింది. వెంటనే ఎటియోస్ వాహనంలో వారిని వెంబడించారు. ఇది గమనించిన తమిళనాడు స్మగ్లర్లు వాహనాలను వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను స్మగ్లర్ల కారుతో పాటు హైజాక్ గ్యాంగ్ కార్లు ఒకదానికొకటి ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.