గజ్వేల్ 'దివ్య మర్డర్' కేసులో కొత్త ట్విస్టులు.. అంతకుముందే పెళ్లి కూడ..
By అంజి Published on 19 Feb 2020 1:51 PM IST
సిద్దిపేట: గజ్వేల్‌లో బ్యాంక్ ఉద్యోగిని దివ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు దివ్యకు ప్రేమ పేరుతో వేధింపులకు గురైందని తెలిసింది. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే మూడేళ్ల క్రితమే దివ్యను వెంకటేష్ రహస్య పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఆర్య సమాజ్‌లో దివ్య, వెంకటేష్ పెళ్లి చేసుకున్నారని, కులాలు వేరు కావడంతో కుటుంబ కలహాలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది.
ఆతర్వాత పెళ్లి ఫొటోతో దివ్యను వెంటకేష్ బ్లాక్ మెయిల్ చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దివ్యను కిడ్నాప్ చేసినట్టు వెంకటేష్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలో దివ్య వెంటపడనని వెంకటేష్ పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఇప్పుడు దివ్య మరో పెళ్లికి సిద్ధపడడంతో వెంకటేష్ కక్ష పెంచుకున్నాడని దివ్య బంధువులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దివ్యను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
మంగళవారం గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దివ్య (25) దారుణ హత్యకు గురైంది. దివ్య ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తోంది. విధులు ముగించుకుని తన రూమ్‌కు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడను కోసి దారుణంగా చంపేశారు. మృతురాలు స్వగ్రామం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట. కాగా, దివ్యకు ఈ నెల 26న వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
దివ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.
మీడియాతో వెంకటేష్ తండ్రి పరశురాం...
దివ్య, వెంకటేష్ ప్రేమ వివాహం చేసుకున్నారని వెంకటేష్ తండ్రి పరశురాం తెలిపారు. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, వెంకటేష్‌పై ఎల్లారెడ్డి పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి దివ్యతో సంబంధాలు లేవని పరశురాం వివరించారు. నిన్న సాయంత్రం నుంచి వెంకటేష్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందన్నారు.