కేసీఆర్ కలల సౌథం ప్రత్యేకలు ఎన్నంటే?

By సుభాష్  Published on  8 July 2020 12:19 PM IST
 కేసీఆర్ కలల సౌథం ప్రత్యేకలు ఎన్నంటే?

థింక్ బిగ్ అన్న మాటకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు సాగుతుంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు ఏదైనా భారీగా ఉంటాయి. సంపన్న రాష్ట్రమన్న దానికి తగ్గట్లే.. కేసీఆర్ హామీలు.. కలలు.. అన్ని భారీగా ఉంటాయన్నది తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఏ మాత్రం నచ్చని కేసీఆర్.. ఎట్టకేలకు తాను అనుకున్నట్లే పాత సచివాలయం స్థానే కొత్త సచివాలయ నిర్మాణం కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి సచివాలయ భవనాల్ని కూల్చేసే ప్రక్రియను షురూ చేయటం తెలిసిందే.

పాత సచివాలయంలోని లోపాల్ని అధిగమిస్తూ..కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. భారీ ఎత్తున నిర్మించే ఈ భవనంలో అత్యాధునిక వసతులు ఉండాలని భావిస్తున్నారు. గతంలో ఒక భవనం నుంచి మరో భవనానికి ఫైల్స్ తీసుకెళ్లేందుకు కాలయాపన బాగా పట్టేదని..అందుకుభిన్నంగా తాజాగా నిర్మిస్తున్న కొత్త భవనంలో అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

కొత్త సచివాలయానికి సంబంధించి తన వరకు వచ్చిన పది నమూనాల్ని పరీశీలించిన కేసీఆర్.. ఫైనల్ చేసిన నమూనాను ఓకే చేసి.. మీడియాకు విడుదల చేయటం తెలిసిందే. చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్నీ అనే సంస్థ రూపొందించిన నమూనాకు కేసీఆర్ సూత్రప్రాయంగా ఓకే చేసినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమానాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ భవనం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఐదేళ్లుగా కలలుకంటున్న కొత్త సచివాలయాన్ని పూర్తిగా సీఎం కేసీఆర్ అభిరుచికి తగ్గట్లు నిర్మించాలన్నది యోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా పలువురి అభిప్రాయాన్ని తీసుకున్న కేసీఆర్.. వాటన్నింటిని కొత్త సచివాలయంలో పొందుపరుస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒకేసారి రెండు హెలికాఫ్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కొత్త సచివాలయాన్ని పూర్తి చేసేందుకు రూ.400 కోట్ల మేర ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. కొత్త నిర్మాణాన్ని 15 నుంచి 20 నెలల మధ్యకాలం పడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. 2023 చివర్లో ఈ భవన ప్రారంభం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. లేని పక్షంలో 2024 మొదట్లో ఉండే అవకాశం ఉండొచ్చు. భవన నిర్మాణాల్ని ఆరేడు ఎకరాల్లో పూర్తి చేసి మిగిలిన ప్రాంతం మొత్తం పచ్చదానికి ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయటంతో పాటు.. వాహన పార్కింగ్ కు ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నారు. భూకంపాలతో పాటు.. విపత్తులు దేనికైనా తట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భారీ భవనాన్ని నిర్మించనున్నారు.

హుస్సేన్ సాగర్ మీదుగా వచ్చే గాలులు భవనంలోకి ప్రవేశించేలా డిజైన్ ఉంటుందని చెబుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఉండే ఈ భవనంలో విద్యుత్తు వినియోగం స్మార్ట్ బిల్డింగ్ తరహాలో ఉండనుంది. వీలైనంతవరకు సోలార్ పవర్ ను వినియోగించేలా డిజైన్ చేయనున్నారు. 800 కార్లు పట్టేలా పార్కింగ్ సౌకర్యం ఉండనుంది. మొత్తం విస్తీర్ణంలో 80 శాతం పచ్చదనానికి కేటాయిస్తూ.. వ్యవస్థలన్ని ఒకేచోట ఉండేలా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. కేసీఆర్ కలల సౌథం.. ఆయన కోరుకునే భారీతనం ఉట్టిపడేలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story