రూ.500 కోట్ల అంచనాతో తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం.!
By సుభాష్ Published on 7 July 2020 11:19 AM GMTతెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేత ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం వారం రోజుల్లోపు కూల్చివేత పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇదే స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ఇదే నెలలో పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. శ్రావణ శుద్ద పంచమి అంటే జూలై 25న లేదా ఆగస్ట్ 3న రాఖీ పౌర్ణమి నాడు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక కూల్చివేత పనులు పూర్తయిన తర్వాత తుది తేదీని ఖరారు చేయనుంది తెలంగాణ సర్కార్. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే డిజైన్‌ను ఖరారు చేసింది.
భవన నిర్మాణానికి రూ.500కోట్లు
కాగా, కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తోంది. కొత్త భవనం నిర్మాణాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. అన్ని అత్యాధునిక హంగులతో ఈ సచివాలయం నిర్మాణం కానుంది. అన్ని హంగులతో నిర్మించబోయే ఈ సచివాలయం కోసం మొత్తాన్ని రిలీజింగ్ ఆర్డర్ జారీ చేసేందుకు కూడా ఆర్‌అండ్‌బి విభాగం త్వరలో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనుంది.
6 లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం
ఆరు లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త సచివాలయ భవన నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం ఆధునాతన హాల్ ను సైతం నిర్మించనున్నారు. మంత్రుల్లో పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. భవనం కోసం పది కంపెనీలు నమూనాలను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిలో ఒకదానిని ముఖ్యమంత్రి ఖరారు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నమూనాను సీఎం కేసీఆర్ దాదాపు ఖరారు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సచివాలయ భవనం ఇక కనుమరుగై దాని స్థానంలో కొత్త భవనం రూపుదిద్దుకోనుంది.