డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం.. నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 6:09 AM GMT
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం.. నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

నేటి నుంచి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల లావాదేవీలను మరింత సురక్షితం చేయడానికి ఆర్‌బీఐ నిర్దేశించిన నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలు చాలా కాలం క్రితం జారీ అయినా.. బ్యాంకులు సిద్దం కాకపోవడంతో అమలు గడువును పొడిగిస్తూ వచ్చారు. ఏటీఎం, పాస్‌ మిషన్‌, ఆన్‌లైన్‌ లావాదేవీల ముందుస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కానున్నది. వారానికి, నెలకు ఎన్ని లావాదేవీలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఆన్‌లైన్ కోసం లేదా భారతదేశంలో లేదా విదేశాలలో కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల కోసం ఆన్‌లైన్ చెల్లింపులను నిలిపివేయాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులు, కార్డులు జారీ చేసే సంస్థలను కోరింది.

కొత్త నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వినియోగించాలంటే ముందుగానే తెలియజేయాల్సి వుంటుంది. ఈ రకమైన లావాదేవీలను వినియోగదారులు ఓకే అంటేనే ఆ సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే.. అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అనుమతితోపాటు వ్యయ పరిమితిని కూడా కార్డు హోల్డర్ నిర్ణయించుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ మెసేజ్ చేరేలా సాఫ్ట్ వేర్ మార్చారు. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ చెల్లింపులను ఓకే చేస్తారు. ఎన్‌ఎఫ్‌సీ సదుపాయాన్ని కూడా నిలుపుదల చేసుకోవచ్చు. ప్రీ-పెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులకు ఈ నిబంధనలు వర్తించవు. డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల మోసాలు తగ్గించేందుకు ఆర్‌బీఐ ఈ నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఇవీ..

  • వినియోగదారులకు తమకు కావాల్సిన సేవలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. తమకు ఏ సదుపాయం అవసరమో.. ఆన్‌లైన్ లావాదేవీకి ఎంత ఖర్చు పరిమితి అవసరమో వారే స్వయంగా నిర్ణయిస్తారు.
  • దేశీయ ఏటిఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
  • డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ పరిమితిని నిర్ణయించుకోవచ్చు.
  • కార్డ్ హోల్డర్ తన కార్డులో పొందవలసిన సేవలను నిర్ణయించుకోవచ్చు.

కార్డులను ఇలా మేనేజ్‌ చేయండి

  • మొదటగా బ్యాంకు ఖాతాను నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ చేయాలి.
  • ఆ తరువాత కార్డు విభాగానికి వెళ్లి నిర్వహణ కార్డును ఎంచుకోండి.
  • అక్కడ మీరు దేశీయ, అంతర్జాతీయ అనే రెండు ఆప్షన్లను చూస్తారు.
  • దీని నుంచి మీరు ఒకదానిని ఎంచుకుని మార్చాలనుకుంటున్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఒక నిర్దిష్ట సేవను నిలుపాలనుకుంటే.. దాని ముందు ఉన్న ఆఫ్ బాడీని నొక్కండి. మీరు ఏదైనా సేవ చేయాలనుకుంటే.. దాని ముందు దానిపై క్లిక్ చేయండి.

Next Story