కరోనా ఎఫెక్ట్‌: కొత్త జంట బయటకు వెళ్లినందుకు ఇంట్లోకి రానివ్వని ఇంటి ఓనర్‌

By సుభాష్  Published on  29 April 2020 4:32 PM GMT
కరోనా ఎఫెక్ట్‌: కొత్త జంట బయటకు వెళ్లినందుకు ఇంట్లోకి రానివ్వని ఇంటి ఓనర్‌

కరోనా కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. ఓ కొత్త జంటకు బయటకెళ్లడమే శాపంగా మారింది. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన కొత్త జంటకు ఇంటి ఓనర్‌ ఊహించని షాకిచ్చాడు. ఊరికి వెళ్లి అర్ధరాత్రి పూట వచ్చిన కొత్త జంటను ఇంట్లోకి రానిచ్చేది లేదని ఓనర్‌ తేల్చి చెప్పాడు. కరోనా పరీక్షలు చేయించుకుని, కరోనా లేదని సర్టిఫికేట్‌ తీసుకొస్తేనే ఇంట్లోకి రానిస్తానని తేల్చి చెప్పాడు. ఇక చేసేదేమి లేక ఆ జంట రాత్రంతా కారులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

కరోనా విజృంభిస్తుండటంతో ఊర్లు తిరుగుతున్నారని, కరోనా వ్యాపిస్తే పరిస్థితి ఏంటని ఓనర్‌ చెప్పుకొచ్చాడు. ఇక గత్యంతరం లేక ఆ జంట పోలీసుల సహాయంతో మరో ఇంటికి మారారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన రంగా, పవిత్రలకు ఇటీవల వివాహమైంది. రంగా బెంగళూరులో కారు డ్రైవర్‌గా పని చేస్తూ, బృందావన్‌ లేఔట్‌లో అద్దెకు ఉంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంతో ఖాళీగా ఉండటంతో సరదాగా బంధువుల ఇంటికెళ్లాడు. అలా రెండు సార్లు బయటకు వెళ్లడం ఇంటి ఓనర్‌ గమనించాడు. ఇలా ఊరికెళ్లి మూడు, నాలుగు రోజుల తర్వాత తిరిగి రావడంతో ఇంటి ఓనర్‌ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు.

కరోనా లేదని నెగిటివ్‌ సర్టిఫికేట్‌ తీసుకువస్తేనే ఇంట్లోకి అనుమతిస్తానని తేల్చి చెప్పడంతో వారు రాత్రంతా కారులోనే గడపాల్సి వచ్చింది. ఈ విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లింది. చివరకూ రంగా కట్టిన అడ్వాన్స్‌ డబ్బులు ఇచ్చేస్తాను తప్ప ఇంట్లోకి రానివ్వనని చెప్పడంతో ఆ దంపతులు వేరే ప్రాంతానికి మారారు.

Next Story