అక్కడ కరోనాతో నిన్న ఒక్కరోజే 250 మంది మృతి

By సుభాష్  Published on  15 March 2020 9:56 AM GMT
అక్కడ కరోనాతో నిన్న ఒక్కరోజే 250 మంది మృతి

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ దేశాలకు సైతం చాపకింద నీరులా పాకుతోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5వేలకు పైగా మృతి చెందగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉంది. మరణాల జాబితాలో చైనా తర్వాత ఇటలీ పేరే ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో చాలా ప్రాంతాల్లో కరోనా విస్తరించినా ప్రభావం మాత్రం ఇటలీలోనే అధికంగా ఉంది. ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా పెరుగుతూనే ఉంది.

ఇటలీలో మాత్రం రోజువారీ జీవనం కష్టతరంగా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ అన్నీ మూతపడ్డాయి. దీంతో ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 1300 చేరింది. శనివారం ఒక్కరోజే 250 మంది మృతి చెందారు. ఇక ఇటలీ ప్రధాన నగరాలకు చైనాలోని వుహాన్‌తో చాలా సంబంధాలున్నాయి. వుహాన్‌, నార్త్‌ ఇటలీ మధ్య అనునిత్యం విమాన రవాణా సాగుతూ ఉంటుంది.

వుహాన్‌లో కరోనా విజృంభించిన తర్వాత కూడా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు యధావిధిగానే సాగాయి. దీంతో ఇటలీలో కరోనా మరింతగా విజృంభించింది. ఇటలీలోని టెక్స్‌ టైల్‌ ఫ్యాక్టరీలను సొంతం చేసుకున్న చైనా దేశ కంపెనీలు, ఇక్కడ పని చేసేందుకు చైనా నుంచి అక్రమ వలసలను ప్రోత్సహించాయి. లక్షలాది మంది చట్టవ్యతిరేకంగా దేశంలోకి వెళ్లినా.. ఇటలీ గుర్తించలేకపోయింది. దీంతో చైనా తర్వాత నార్త్‌ ఇటలీ కరోనాతో హడలెత్తిపోతోంది.

Next Story