కరోనా ఎఫెక్ట్‌: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

By సుభాష్  Published on  14 March 2020 2:09 PM GMT
కరోనా ఎఫెక్ట్‌: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వందకుపైగా దేశాలకు విస్తరించింది. కరోనా ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూతపడ్డాయి. ఇక ఇతర దేశాల గురించి చెప్పనక్కర లేదు. మన దేశంలోకంటే ఇతర దేశాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉంది. కారోనా వల్ల ఇప్పటి వరకు 5 వేలకుపైగా మృతి చెందారు. మృతుల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే, ఇటలీ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఇటలీ, యూకే ప్రాంతాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది.

ఇక బ్రిటన్‌లో ఇప్పటికే 798 కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మే 7వ తేదీన జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం వాయిదా వేసినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదనే గుర్తించిన ఎన్నికల అధికారులు.. ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది వరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ వారంలోనే కేవలం ఒక రోజులోనే 208 కరోనా కేసులు నమోదు కావడంతో బ్రిటల్‌లో తీవ్ర భయాందోళన నెలకొంది.

తాజాగా కరోనా భయంతో తెలంగాణలో సైతం విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో షాపింగ్‌మాల్స్‌ సైతం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో రెండో కరోనా కేసు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Next Story