‘కరోనా’ అంటూ ఆఫీసుకు డుమ్మా.. ఉద్యోగికి 3 నెలలు జైలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2020 12:50 PM GMT
‘కరోనా’ అంటూ ఆఫీసుకు డుమ్మా.. ఉద్యోగికి 3 నెలలు జైలు

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు యుద్దం చేస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలో తెలియక అందరూ తలలుపట్టుకుంటున్నారు. వందకు పైగా దేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే 5,429 మంది మృత్యువాత పడగా.. 1,45,379 మంది బాధితులు పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఆఫీసుకు డుమ్మా కొట్టే ప్రయత్నంలో తనకు కోవిడ్ 19 సోకిందని చెప్పాడు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

చైనాలోని ఓ ఉద్యోగి ఆఫీస్‌ పని నుంచి తప్పించుకునేందుకు ఓ ప్లాన్‌ వేశాడు. తనకు కరోనా పాటిజివ్‌ అంటూ ఆఫీస్‌కి ఫోన్‌ చేసి చెప్పాడు. . దీంతో అతడిని ఆఫీసుకు రావద్దని, సెలవు తీసుకోవాలని బాస్ చెప్పాడు. అతడికి కరోనా వైరస్ నిర్ధరణ అయ్యిందని తెలియగానే ఆఫీసులో భయాందోళనలు నెలకొన్నాయి. మూడు రోజులపాటు సిబ్బందికి సెలవులిచ్చి ఆఫీసు మొత్తాన్ని శుభ్రం చేశారు. అనంతరం తన సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అతడికి వ్యాధి ఎలా సోకింది..? అతడు ఏయే ప్రాంతాల్లో తిరిగాడు..? ఎవరిని కలిశాడు..? అనే వివరాలపై ఆరా తీసి.. వారిని చికిత్సకు తరలించాలని భావించారు. ఈ క్రమంలో అతడికి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అతడు ఓ షాపింగ్ మాల్‌లో కొంతమందిని కలిశానని, అందువల్లే వైరస్ సోకి ఉండవచ్చని తెలిపాడు. ఈ సందర్భంగా తాను షాపింగ్ మాల్‌కు వెళ్లినట్లుగా కొన్ని ఆధారాలు చూపించాడు. అవన్నీ ఫోర్జరీ చేసినవి తెలియడంతో వైద్య పరీక్షలు తరలించారు. రిపోర్టులో అతడికి కరోనా వైరస్ లేదని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు, సంస్థను తప్పుదోవ పట్టించినందుకు గానూ ఆ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష పడింది.

Next Story