ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పలు రంగాలపై దెబ్బతీస్తోంది. తాజాగా తెలంగాణలో మరో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 31 వరకు తెలంగాణాలో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. అంతేకాదు జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌ కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, తెలంగాణలో రెండో కరోనా కేసు నమోదు కావడంతో ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు సినిమా హాల్స్‌, మాల్స్‌లను మూసివేయాలని హైలెవల్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలో నెల్లూరు యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారణ కాగా.. మరికొందరికి ఈ వైరస్‌ లక్షణాలుండటంతో ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. ఇదిలాఉంటే తెలంగాణలోనూ కరోనా వైరస్‌ ప్రభావం పెరుగుతుంది. తాజాగా శనివారం రాష్ట్రంలోనూ కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్దారించారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.