కొత్త రాజధానికి ఆ ముగ్గురి సహకారం?
By రాణి Published on 1 Feb 2020 6:10 AM GMTఅవునండీ రాజధాని మారుతోంది. అధినాయకుడు కొత్త రాజధానిని కడుతున్నారు. అందుకు ముగ్గురు ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరికి నిర్మాణరంగంలో అనుభవం ఉంది. ఇంకొకరికి కొత్త రాజధాని కట్టిన అనుభవం ఉంది. మూడో వ్యక్తికి నిధులు సమకూర్చే సామర్థ్యం ఉంది. అందుకే ఈ ముగ్గురికీ అధినేత ఎర్ర తివాచీ పరిచారు.
అధినేత జగన్మోహన్ రెడ్డి అని, కొత్త రాజధాని అంటే వైజాగో కర్నూలో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఇండొనీసియాకి సంబంధించిన కథ. ఇండొనీసియా దేశాధ్యక్షుడు జోకో జోకోవి విడోడో కూడా కొత్త రాజదానిని నిర్మించాలనుకుంటున్నారు. ఇండోనీసియా పాత రాజధాని మన అమరావతిలాగానే వరద ముంపుకు గురయ్యే ప్రాంతం. అక్కడ మన అమరావతి లాగానే చాలా ఇబ్బందులున్నాయి. అందుకే కొత్త రాజధాని కావాలని ఆయన నిర్ణయించారు. ఈ పని కోసం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువరాజు షేఖ్ మహ్మద్ బిన్ జయేద్, జపాన్ లోని సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ సీ ఈ వో మసయోషి సోన్, బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ల సాయం తీసుకుంటున్నారు. 466 బిలియన్ల డాలర్ల రాజధాని కట్టడంలో ఈ ముగ్గురూ తమ వంతు తోడ్పాటునిస్తున్నారు
ప్రిన్స్ జయేద్ యూ ఏ ఈ లో అభుదాభిని పునర్నిర్మించడమే కాదు. మస్దర్ అనే మరో నగరాన్ని సృష్టించాడు. మసయోషీ సోన్ కి ఆర్ధిక వనరుల సమీకరణలో అపారమైన అనుభవం ఉంది. ఇక బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కు అపార పాలనానుభవం ఉంది. అయితే వీరికి ఎలాంటి జీత భత్యాలు ఉండబోవని దేశాధ్యక్షుడు విడోడో ప్రకటించారు.
ఈ రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే నిధులలో కొంత భాగాన్ని ప్రభుత్వం ఇస్తుంది. మిగతావి పబ్లిక్ - ప్రభుత్వ సహకార విధానం (పీపీపీ) లో సేకరించి, నిర్మాణం చేస్తారు. ప్రైవేటు రంగం గృహనిర్మాణం, యూనివర్సిటీల నిర్మాణం, షాపింగ్ మాల్స్ ను కట్టడంలో సహకరిస్తుంది. వీటితో పాటు విమానాశ్రయాలు, టోల్ రోడ్లను మెరుగుపరుస్తుంది.