కరెంట్ మీటర్‌ను ఫోటో తీసి పంపితే చాలు..
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 5:29 PM ISTతెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతోంది. ఈ నేపధ్యంలో కరెంట్ మీటర్ రీడింగ్ కష్టంగా మారింది. దీంతో విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే నెలకు కరెంట్ మీటర్ రీడింగ్ నమోదును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే.. రెండు నెలలకు పైగా మీటర్ రీడింగ్ ను తీసుకోలేదు. ఇలాగే కొనసాగితే.. స్లాబ్‌లు మారిపోయి బిల్లు పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిని నివారించేందుకు తెలంగాణ ఉత్తర డిస్క్ం బిల్లుల చెల్లింపు విషయంలో సరికొత్త యాప్‌ను తీసుకొని రానుంది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్దకు రాకుండానే మీటర్ రీడింగ్‌ను నమోదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా.. ఎవరి ఇంటి మీటర్‌ను వారు ఫోటో తీసి పంపితే.. బిల్లు జనరేట్ అవుతుందని డిస్కమ్ సీఎండీ అన్నమనేని గోపాలరావు తెలిపారు. ప్రస్తుతం ఈ తరహా విధానాన్ని ఢిల్లీలో వినియోగిస్తున్నారు. ఆన్ లైన్ లో మీటర్ ఫోటో తీసి 7వ తేదీలోగా దాన్ని పంపించి డబ్బులు చెల్లిస్తే, ఒక శాతం రాయితీని, 8 నుంచి 14 లోగా చెల్లిస్తే అర శాతం రాయితీని అందిస్తుంది అక్కడి ప్రభుత్వం.
వినియోగదారులు ఏం చేయాలంటే..
స్మార్ట్ ఫోన్లలో వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కరెంటు కనెక్షన్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. ఆతరువాత మీటర్ రీడింగ్‌ను నెలకోసారి ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే.. అది డిస్కంలకు చేరి ఎంత బిల్లు వస్తుందో తెలుసుకోవచ్చు.