మలి సంజెలోనూ మనోరంజనమే..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 18 July 2020 1:07 PM GMT- 83 ఏళ్లదాకా ఫ్రీ సభ్యత్వం
- నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్
ఏ వయసుకు ఆ ముచ్చట. మాంఛి ప్రాయంలో ఉన్నప్పుడు కాలం హుషారు జోరుగా ఈల వేస్తుంది.. శరీరం విమానంలా దూసుకెళుతుంది. కానీ వయసవుతన్నకొద్దీ బరువు బాధ్యతలు పెరుగుతాయి. జీవితం మందకొడిగా నడుస్తుంది.. తాతగారూ కాస్త అప్ డేట్ అవండి అలా ఓ సారి బైటకొచ్చి నిలబడండి ప్రపంచం ఎలా దూసుకెళుతుందో అర్థమవుతుంది అని మనవళ్లు పరాచికాలాడే సమయమూ వస్తుంది. ఇంకాస్త వయసుడిగి ముసలాళ్లయ్యాక ఇంకేం ఉంటుంది.. ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది. మీరు ఏది గొణిగినా ఎవరూ వినరు పైగా ఏంటో ఈ ముసలోళ్ల చాదస్తం అంటూ పెదవి విరిచేస్తుంటారు. ఇదీ మన జీవనయాన సమగ్ర స్వరూపం.. సారాంశం. జీవితాన్ని కాచి వడబోసిన వారెవరయినా ఇంతే చెబుతారు. అయితే మీకు ఎనిమిది పదుల వయసు వచ్చినా సరే నట్టింట్లో దర్జాగా కూర్చొని బుల్లి తెరపై కొత్త కొత్త సినిమాలు, సీరియళ్లు పుకుట్ గా చూడొచ్చు.. ఒట్టేసి చెబుతున్నాం మా మాట నమ్మండహో అంటోంది నెట్‌ఫ్లిక్స్.
కాస్త నమ్మబుద్ధి కాకపోవచ్చు గానీ ఇది నిజంగా నిజం. మీకు 83 ఏళ్లు వచ్చేదాకా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కొత్త చిత్రాలను వినోదాంశాలను ఆనందంగా ఆస్వాదించవచ్చని అందుకోసం ఒకేసారి 83 ఏళ్ల దాకా మీకు ఉచిత సభ్యత్వాన్ని ఆఫర్ చేస్తోంది. మరి మర్కెట్లో పోటీ అంతలా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు ఇవ్వకపోతే ప్రేక్షకులు రిమోట్ బటన్లు తిప్పేసే ప్రమాదముంది. అసలే నీ దూకుడూ అనేలా కొత్త ఆలోచనలతో దూసుకెళుతున్న గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజం నెట్ ప్లిక్స్ సరికొత్త సంచలనానికి తెరతీసింది.
అబ్బా ఇంకేముంది ఛాన్స్ కొట్టేసినట్టే అనుకుంటున్నారా.. ఆగండాగండి. తొందరపడకు సుందర వదనా అన్నట్టు, ఆ బోడిగుండు బంగారాయన టీవీల్లో రోజూ అంటుంటాడే.. ఏదీ ఊరికే రాదు అని అది కూడా నిజం. నెట్ ఫ్లిక్స్ ఈ ఆఫర్ కు ఓ చిన్న కండిషన్ పెట్టింది. మీరు ఈ ఉచిత ఆఫర్ అందుకోవాలంటే ఈ ఓటీటీలోనే వచ్చే ద ఓల్డ్ గార్డ్ గేమ్ లో అత్యధిక స్కోరు సాధించాలి. అలా స్కోరు చేసిన వారు 83 సంవత్సరాలు లేదా 1000 నెలలు నెట్ ఫ్లిక్స్ ఉచిత సేవలు అందుకోవచ్చు. ఈ వీడియో గేమ్ ను జులై 17 రాత్రి 8 గంటల నుంచి జులై 19 దాకా ఆడే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుందన్న మెలిక కూడా పెట్టింది.
గత వారం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఓల్డ్ గార్డ్ సినిమా విడుదలయింది. ఈ సందర్భంగా సంస్థ వినియోగదారులకు ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ను సంస్థ ఇమ్మార్టల్ అకౌంట్ గా అభివర్ణిస్తోంది. ఓల్డ్ గార్డ్ వీడియోగేమ్ లో మీరు లీడ్ క్యారెక్టర్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. అంతే కాదు చాలా మంది శత్రువులను లాబ్రిస్ ఖడ్గంతో హతమార్చాల్సి ఉంటుంది. ఈ ఖడ్గానికి రెండంచుల పదును ఉంటుంది. అయితే.. ఈ ఆటలో శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయవచ్చు.. హతమార్చవచ్చు. ఆ దుష్పరిణామాలు జరక్కుండా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ శత్రువులతో యుద్ధం చేస్తూ ఆటాడాలి. గెలిచారో నెట్ ఫ్లిక్స్ రాజ్యం మీ వీరభోజ్యమే!!.