'నీట్'కు సరిగా ప్రిపేర్ కాలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 12 Sep 2020 10:17 AM GMT"నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. నేను మెడికల్ సీటు పొందకపోతే నేను మిమ్మల్ని నిరాశపరుస్తానని భయపడుతున్నాను. ” అని సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రేపు(ఆదివారం) నీట్ పరీక్ష జరగనుండగా.. ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మదురైలో ఎస్‌ఐగా మురుగసుందరం విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుమారై జ్యోతి దుర్గ నీట్ ఎగ్జామ్‌కు ప్రీపేర్ అవుతుంది. కాగా.. తనకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన చెందింది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే.. మెడికల్ సీటు దక్కదని బావించింది. కుటుంబ సభ్యులు తన కోసం పడుతున్న శ్రమ అంతా వృథా అవుతుందని.. తీవ్ర మనస్థాపానికి గురైంది. తను చదువుకునే గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఉదయం ఆమెకు టీ ఇచ్చేందుకు గదిలోకి వెళ్లగా.. జ్యోతిదుర్గ ఉరికి వేలాడుతూ కనిపించింది. “మీ అందరికీ నాపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ నన్ను క్షమించండి. ఒకవేళ నేను మెడికల్ సీటు పొందడంలో విఫలమైతే, నా కోసం మీరు పడుతున్న కృషి అంతా ఫలించదు. నేను మిమ్మల్ని నిరాశపరుస్తాను. నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. ” అని సూసైడ్ నోట్‌లో రాసింది. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వీడియో గేమ్స్ ఆడకుండా ఉండాలని ఆమె తన సోదరుడికి సూచించింది.
కాగా.. ఇది ఆమె రెండవ ప్రయత్నం. గత సంవత్సరం పరీక్షను క్లియర్ చేయలేకపోవడంతో.. దుర్గా తీవ్ర ఒత్తిడి మరియు నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సారి కూడా పరీక్షకు సన్నద్దత సరిగ్గా లేకపోవడంతో.. మళ్లీ పరీక్షలో తప్పుతానని బావించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా బావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.