విజయవాడ నుండి బయలుదేరిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jun 2020 1:05 PM ISTవిపత్తులు తలెత్తినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మందిని కాపాడుతూ ఉంటాయి. గతంలో ఎన్నో ఉపద్రవాలు ముంచుకుని వచ్చినప్పుడు సామాన్యులను కాపాడి.. కొత్త జీవితాలను ప్రసాదించాయి ఈ బృందాలు. ప్రస్తుతం నిసర్గ తుఫాను గుజరాత్, మహారాష్ట్రలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉండగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివిధ ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాలకు చేరుకుంటూ ఉన్నాయి. భటిండా నుండి 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విజయవాడ నుండి మరో 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విమానయానం ద్వారా అవసరమైన ప్రాంతాలకు చేరుకున్నాయి.
30కి పైగా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో సిద్ధంగా ఉంచారు. ఒక్కో టీమ్ లో 45 మంది ఉంటారు. గుజరాత్ రాష్ట్రం ఇంకో 5 టీమ్ లు కావాలని కోరిందని ఎన్.డి.ఆర్.ఎఫ్. ఛీఫ్ ఎస్.ఎన్. ప్రధాన తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం, ఎమర్జెన్సీ టీమ్ లను రంగంలోకి దించింది. ముంబై తీర ప్రాంతాల్లో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రపు అలలు సుమారు 6 అడుగుల ఎత్తుతో ఎగసి పడుతున్నాయి. దాదాపు 100 సంవత్సరాల తరువాత ముంబై మహా నగరంపై అత్యంత తీవ్ర తుఫాను 'నిసర్గ' ముంచుకుని వచ్చింది. మొబైల్ ఫోన్ లు ఛార్జింగ్ లో పెట్టుకుని ఉండాలని.. గ్యాస్ సప్లైను ఆఫ్ చేసి ఉంచాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఆభరాణాలను సీల్డ్ కవర్స్ లో ఉంచాలని తెలిపారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.