నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం

By సుభాష్  Published on  3 Oct 2020 12:00 PM GMT
నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం

సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు గుప్పించింది. నయీం కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసైకు లేఖ రాసింది. నయీం కేసును నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. బాధితులకు న్యాయం జరగలేదు.. నేరస్తులకు శిక్ష పడలేదు అని లేఖలో పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి పాదర్శకంగా దర్యాప్తు చేయించాలని కోరింది.

నయీం డైరీని బయటపెట్టాలి

కేసును పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కేసును నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతోందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. నయీం కేసులో పోలీసులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. నయీం ఇంట్లో డబ్బులు లెక్కించడానికి రెండు కౌంటింగ్‌ మిషన్లు తీసుకెళ్లి, రూ.3.74 లక్షలు మాత్రమే దొరికినట్లు చూపించడం దారుణమన్నారు. 240 కేసులు నమోదు చేసి నాలుగేళ్లయినా ఇప్పటి వరకు 173 చార్జ్‌షీట్లు మాత్రమే దాఖలయ్యాయని మండిపడ్డారు. అలాగే నయీం డైరీని బయటట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీబీఐతో విచారణ జరిపించి, నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story
Share it