ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు పర్యటించారు. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న మహిళల నుంచి సమాచారం సేకరించారు. పోలీసుల దాడికి సంబంధించి అంశాలపై మహిళా కమిషన్‌ కో ఆర్డినేటర్‌ కాంచన కట్టర్‌, కౌన్సిలర్‌ ప్రవీణ్‌ సింగ్‌లు ఆరా తీశారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న దాడులను టీడీపీ నేతలు కమిషన్‌ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ కమిషన్‌ సభ్యులను టీడీపీ నేతలు ఎంపీ గల్లా జయదేవ్‌, పంచుమర్తి అనురాధ, దివ్యవాణి కలిశారు. రాజధానిలో రైతుల, మహిళల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో వివరించారు.

అలాగే తుళ్లూరు తహసీల్దార్‌, డీఎస్పీని కలిసి కమిషన్‌ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ కమిషన్‌ సభ్యులు దగ్గరికి రాజధాని గ్రామాల మహిళలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను వారికి వివరించారు. పోలీసులు దాడులు చేసిన వీడియోలను కమిషన్‌ సభ్యులకు చూపించారు. ఇదిలా ఉంటే తమ మహిళా పోలీసులపై కూడా కొందరు దాడికి దిగారని ఏపీ పోలీస్‌ సంఘం కమిషన్‌ సభ్యులను ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్‌ సభ్యులను మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి మాలతీ రాణి కలిశారు. అమరావతిలో ఉద్రిక్తతలకు గల కారణాలను వివరించారు. రాజధాని ఆందోళనల్లో మహిళపై పోలీసుల దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో.. మహిళా కమిషన్‌ ఇప్పటికే సుమోటగా కేసు స్వీకరించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.