ఇక నుండి తొమ్మిది కాదు.. ఎనిమిదే కేంద్రపాలిత ప్రాంతాలు..!

By అంజి  Published on  27 Nov 2019 6:58 AM GMT
ఇక నుండి తొమ్మిది కాదు.. ఎనిమిదే కేంద్రపాలిత ప్రాంతాలు..!

ఢిల్లీ: ఇప్పటివరకు రెండు వేరు వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా చలామణిలో ఉన్న డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలను ఒకటిగా విలీనం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ది దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల విలీనం బిల్లు 2019ని మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి ఏర్పడే కొత్త ప్రాంతానికి దాద్రానగర్ హవేలి అండ్ డామన్ డయ్యుగా నామకరణం చేయనున్నారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్‌ ఉన్నాయి. జనాభా, భూ విస్తీర్ణం పరిమితంగానే ఉండటం వల్ల వీటిని విలీనం చేసి అధికారుల సేవలు మరింత సమర్థంగా ఉపయోగించుకునే లక్ష్యంతో బిల్లు ప్రవేశ పెట్టామన్నారు.

కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేసే చిన్న రాష్ట్రాన్నే కేంద్రపాలిత ప్రాంతం అంటారు. ఇప్పుడు ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్‌-నికోబార్‌ దీవులు, లక్ష దీవులు, చంఢీఘర్‌, దాద్రా నగర్‌ హవెలీ, డామన్‌ డయ్యూ, జమ్ముకశ్మీర్‌, లఢక్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు (జమ్ముకశ్మీర్‌, లఢక్‌లను కలుపుకొని) సంఖ్య 9గా ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లులు ఆమోదం పొందితే దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గనుంది. ఇటీవలే జమ్ముకశ్మీర్‌, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన విషయం తెలిసిందే.

Next Story