తొమ్మిదిన్నర కోట్లు.. తీసుకుని వెళ్లండయ్యా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2020 3:35 PM GMT
తొమ్మిదిన్నర కోట్లు.. తీసుకుని వెళ్లండయ్యా..!

తొమ్మిదిన్నర కోట్లు మీకు సొంతమైతే మీరు ఏమి చేస్తారు చెప్పండి. ఎగిరి గెంతేయరు..! అయినా అంత అదృష్టం మనకు ఎక్కడ ఉంది. ఏ లాటరీ తగిలితే కానీ వీలవ్వదు. కానీ ఆ లాటరీ తగిలినా కూడా వెళ్లి తీసుకోకపోతే అంతకంటే దురదృష్టమైన ఘటన ఏదీ ఉండదు.

ఒక మిలియన్ పౌండ్లు.. అంటే భారత కరెన్సీలో తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు. నేషనల్ లాటరీ ప్రైజ్ లో ఒకరి లాటరీ నంబర్ కు తగిలింది. దాదాపు ఆరు వారాలు గడుస్తున్నా తీసుకోడానికి ఏ ఒక్కరూ రావడం లేదు. బెడ్ ఫోర్డ్ లో ఈ లాటరీ టికెట్ ను కొన్నారు. మొత్తం అయిదు నంబర్లు మ్యాచ్ అవ్వగా మార్చి 14న లోటో డ్రా కూడా తీశారు. మొత్తం విన్నింగ్ నంబర్స్ 07, 22, 30, 38, 42, 47 కాగా.. బోనస్ బాల్ 14.

ఆ లక్కీ టికెట్ ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ వచ్చి తీసుకుని వెళ్ళాలని గత ఆరు వారాలుగా చెబుతోంది. సెప్టెంబర్ 10 లోగా లాటరీ ప్రైజ్ ను తీసుకోవాలని లాటరీ నిర్వాహకులు కోరుతున్నారు. లాటరీ టికెట్ కొన్న వ్యక్తులు దాన్ని కొన్న విషయం మరిచిపోయి ఉంటారని అనుకుంటున్నామని నేషనల్ లాటరీ సీనియర్ విన్నర్స్ అడ్వైజర్ ఆండీ కార్టర్ తెలిపారు. ప్రస్తుతం అందరూ ఇళ్లకే పరిమితమైన తరుణంలో కొన్న లాటరీ టికెట్లను బాగా పరిశీలించాలని.. కొన్ని నిమిషాల పాటూ వెతకడం వలన కొన్ని కోట్లు సొంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించారు.

చాలా మంది లాటరీ విజేతలు.. వారి వారి టికెట్లను కొన్నాక చూసుకోరని.. ఎక్కడో ఒకచోట పారేసి ఉంటారని ఆయన భావిస్తున్నారు. కొద్దిగా ఓపిక చేసుకొని వెతకాలని తెలిపారు. నేషనల్ లాటరీ సంస్థ కూడా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ లాటరీ టికెట్లను కూడా చెక్ చేసుకోవాలని సూచిస్తోంది. ఎవరిదగ్గరైతే విన్నింగ్ లాటరీ టికెట్ కానీ వుంటే వీలైనంత తొందరగా 0333 234 5050 ఫోన్ చేయాలని సూచించారు. అదృష్టం వరించినా కూడా ఆ లాటరీ టికెట్ ను చూసుకోని ఆ దౌర్భాగ్యులు ఇంతకూ ఎవరో..?

Next Story