పోలవరం బాధితులను నీళ్లలో ముంచుతారా?: గ్రీన్ ట్రిబ్యునల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2019 1:18 PM ISTముఖ్యాంశాలు
- పోలవరం పూర్తి బాధ్యత పోలవరం అథారిటీదే: ఎన్జీటీ
- నలుగురు సభ్యులతో కూడిన కమిటీ
- తదుపరి విచారణ ఫిబ్రవరి 14కు వాయిదా
ఢిల్లీ: పోలవరం పునరావాసం, డంపింగ్ అంశాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో విచారణ జరిగింది. ఎన్జీటీ ముందు పోలవరం మొంబర్ సెక్రటరీ బిపి పాండే, పోలవరం ఎస్‌ఈ నాగిరెడ్డి హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు వ్యర్థాలను గ్రామాలలో డంప్ చేస్తున్నారని ఎన్జీటీకి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. గ్రామాలలో చట్టవిరుద్ధంగా డంపింగ్ చేస్తున్నారని ఎన్జీటీకి పెంటపాటి పుల్లారావు తెలిపారు. పోలవరం పూర్తి బాధ్యత పోలవరం అథారిటీ దేనని ట్రిబ్యునల్ తెలిపింది. కాపర్ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు పునరావాసం ఎందుకు చేయలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. కాపర్ డ్యామ్ వల్ల ముంపు వాటిల్లిన మాట వాస్తవమేనని పోలవరం మెంబర్ సెక్రటరీ ఎన్జీటికి తెలిపారు. ప్రాజెక్టు బాధితులను నీళ్లలో ముంచేస్తారా అంటూ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.
ప్రజలను ముందుగానే వేరే ప్రాంతాలకు తరలించామని, వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలవరం ఎస్‌ఈ నాగిరెడ్డి నివేదించారు. ఇల్లు మునిగిపోయిన వారికి నష్టపరిహారం ఏం ఇచ్చారని, జాతీయ ప్రాజెక్టును ఇంత అధ్వానంగా నిర్మిస్తున్నారు ఏమిటి అని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. కాపర్ డ్యామ్ నిర్మాణం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ప్రభావంపై అంచనా వేశారా లేదా అని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. నెల రోజుల కిందటే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు నివేదిక అందజేశామని పోలవరం అథారిటీ ఎన్జీటీకి తెలిపింది. ఆ నివేదికను తమకు కూడా అందజేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.