కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. వైద్యారోగ్యశాఖ అలర్ట్
కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 4:15 PM ISTకర్ణాటకలో జికా వైరస్ కలకలం.. వైద్యారోగ్యశాఖ అలర్ట్
కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. బెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాలను వెల్లడించింది. కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిలో వంద మంది శాంపిళ్లను సేకరించారు. వాటిని పరిశీలించగా ఒకరికి జికా పాజిటివ్ వచ్చింది. అయితే.. జికా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి చిక్కబళ్లాపూర్ వాసి కావడంతో వైద్యాధికారులంతా అప్రమత్తం అయ్యారు. ఆగస్టులోనే ఈ నమూనా పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్‌లో ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
కర్ణాటక వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. చిక్కళ్లాపూర్‌లోని దోమలను సేకరించి పరీక్షకు పంపగా.. వాటిలో ఈ వైరస్ ఉన్నట్లు తెలిసిఆంది. వైద్యాధికారులు ఎఫెక్ట్ ఏరియాల్లో హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ముగ్గురి నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. గతేడాది కర్ణాటకలో తొలి జికా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయ్యిన విషయం తెలిసిందే. రాయచూర్ జిల్లాలో 5 ఏళ్ల బాలికకు గతేడాది జికా వైరస్ సోకింది. జికా వైరస్‌కు ఏడెస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. తొలిసారి ఈ వైరస్‌ను 1947లో ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్లనొప్పులు, కళ్లు ఎర్రగా మారడం, కండరాల నొప్పి దీని లక్షణాలు. మహిళలు గర్భధారణ సమయంలో ఈ వైరస్ బారిన పడితే శిశువులు కొన్ని అవలక్షణాలతో పుట్టే ప్రమాదముంది. అంతేకాకుండా, ఈ వైరస్ ద్వారా మరికొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు నివారణ చర్యలు చేపట్టారు.ఇప్పటికే ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వైరస్ ని నిర్మూలించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వెంకటాపుర, దిబ్బురహళ్లి, బచ్చనహళ్లి, వడ్డహళ్లి తదితర ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.