'మీరు వీరుడే కావొచ్చు.. కానీ అగ్నివీరుడివి మాత్రం కాదు'.. సుప్రీంకోర్టులో ఆసక్తికర సంభాషణ

"You May Be Veer, Not Agniveer," Supreme Court Told Lawyer At Hearing. సుప్రీంకోర్టులో సాయుధ బలగాల కోసం రక్షణ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం గురించి దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది.

By అంజి  Published on  19 July 2022 9:30 AM GMT
మీరు వీరుడే కావొచ్చు.. కానీ అగ్నివీరుడివి మాత్రం కాదు.. సుప్రీంకోర్టులో ఆసక్తికర సంభాషణ

సుప్రీంకోర్టులో సాయుధ బలగాల కోసం రక్షణ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం గురించి దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది. అడ్వకేట్‌ శర్మ.. సుప్రీంకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్‌, న్యాయవాది శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అగ్నిపథ్‌ గురించి వాదనలు జరుగుతున్న సమయంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సరదగా ఓ కామెంట్‌ చేశారు. ''నువ్వు వీరుడివే కావొచ్చు, కానీ అగ్నివీరుడిని కాదు'' అని న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. దీంతో కోర్టులో తీవ్రమైన వాదనల మధ్య చిరునవ్వులు వచ్చాయి.

సుప్రీంకోర్టులో న్యాయవాది శర్మ పిల్‌లు దాఖలు చేయడంలో పాపులర్. శర్మ.. ఎప్పుడూ ఏదో ఒక పిల్‌ కోర్టులో వేస్తూనే ఉంటారు. అయితే జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్య తర్వాత అడ్వకేట్ శర్మ స్పందించారు. త‌న క‌ష్టాన్ని, ప్రయత్నాలను మెచ్చుకోవడానికే జ‌స్టిస్ చంద్ర‌చూడ్ గుర్తించి ఆ కామెంట్ చేశార‌ని శ‌ర్మ అన్నారు. అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ తొలి పిల్ దాఖ‌లు చేసింది తానే అని, అందుకే జ‌స్టిస్ చంద్ర‌చూడ్ త‌నను అలా అని ఉంటార‌ని శ‌ర్మ అన్నారు. అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

అగ్నిపథ్‌పై.. శర్మ, హర్ష్‌ అజయ్‌ సింగ్‌, రవీంద్ర సింగ్‌ షెకావత్‌లు దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను కోర్టు విచారించింది. ప్రభుత్వం 'అగ్నిపథ్' ప్రకటన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వ్యక్తులు నాలుగు సంవత్సరాల కాలానికి సాయుధ దళాలలో నియమించబడతారు. ఆ తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు లేకుండా పదవీ విరమణ ఉంటుంది.

రెండేళ్లుగా ఎయిర్‌ఫోర్స్‌లో నియామకం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు తమ 20 ఏళ్ల కెరీర్ ఇప్పుడు నాలుగేళ్లకు తగ్గిపోతుందనే భయంతో ఉన్నారని ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు వాదించాయి. కాగా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

న్యాయమూర్తులు చంద్రచూడ్, సూర్యకాంత్, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులను కూడా ఈ పథకానికి వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్న పిల్‌లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని లేదా నిర్ణయం వచ్చే వరకు పెండింగ్‌లో ఉంచాలని కోరింది. నాలుగు హైకోర్టుల్లోని పిటిషనర్లు కూడా ఢిల్లీ హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Next Story