ఆ శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు.

By Medi Samrat  Published on  8 Feb 2025 5:00 PM IST
ఆ శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి పెద్ద నేతలు ఓటమిపాలయ్యారు. ఫలితాలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. యమునా నది శాపం తగలడం వల్లే ఆప్ ఓడిపోయిందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తీరని ద్రోహం చేశారని.. ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేశారని విమర్శించారు. మంచి నీటికి బదులుగా మద్యం పంపిణీ చేశారని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరోగ్య పథకాలపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం యమునా నదిని పరిశుభ్రంగా మారుస్తుందని అన్నారు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు యమునా తీరానికి వెళ్లేలా సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. మూడేళ్ళలో యమునా నదిని శుభ్రం చేస్తామని మనోజ్ తివారీ హామీ ఇచ్చారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. జంగ్ పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.

Next Story