30 కి.మీ నుంచి నదిలో కొట్టుకొచ్చిన మహిళ.. కాళ్లు కట్టేసి..

ఒడిశాలో ఊహించని సంఘటన జరిగింది.

By Srikanth Gundamalla  Published on  2 Aug 2024 1:28 AM GMT
woman,  river,  tied legs, odisha,

30 కి.మీ నుంచి నదిలో కొట్టుకొచ్చిన మహిళ.. కాళ్లు కట్టేసి..

ఒడిశాలో ఊహించని సంఘటన జరిగింది. ఓ మహిళ నది ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. అక్కడే ఉన్న మత్స్యకారులకు ఆమె అరుపులు వినిపించాయి. దాంతో.. దగ్గరకు వెళ్లి చూసి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి చూసి షాక్‌ అయ్యారు. ఆమె కాళ్లను కట్టేసి ఉన్నట్లుగా చెప్పారు. అయితే.. ఆమె దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి నదిలో కొట్టుకువచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.

ఒడిశాలోని ఝార్సుగూడ దగ్గర ఉన్న పల్సాడ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగు చూసింది. కొందరు మత్స్యకారులు చేపలు పడుతున్నారు. అదే సమయంలో నదిలో నుంచి ఒక మహిళ కేకలు మత్స్యకారులకు వినిపించాయి. దాంతో.. వెంటనే అప్రమత్తం అయిన మత్స్యకారులు నదిలో ఉన్న మహిళను ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమకు నీరు, ఆహారం అందించి కాస్త కుదుట పడేలా చేశారు. అయితే.. నదిలో కొట్టుకువచ్చిన మహిళ కాళ్లకు సంకెళ్లు ఉన్నాయి. దాంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వివరాలను సేకరించారు. చత్తీస్‌గడ్‌లోని రాయ్‌గఢ్‌కు చెందిన సరోజిని చౌహాన్ (33)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కాగా.. భర్త నుంచి విడిపోయిన సదురు మహిళ.. ఆమె సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటోందని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం సదురు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసింది. అందుకే ఆమె కాళ్లను సంకెళ్లతో కట్టేసి ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచామని సోదరుడు పోలీసులతో చెప్పాడు. నదిలో ఎలా పడిందనే విషయం తమకు తెలియదని అన్నాడు. వైద్య పరీక్షల తర్వాత సదురు మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు.

Next Story