2021 బడ్జెట్‌లో మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలుగనుందా..?
Will there be relief for middle class taxpayers in the budget?.ఫిబ్రవరి 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By తోట వంశీ కుమార్
ఫిబ్రవరి 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2021 బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పరిశ్రమలు, ఆటో మొబైల్ ఇండస్ట్రీలు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీతో పాటు మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులు కూడా రెట్టింపు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక పన్ను చెల్లింపులో ఏదైనా మినహాయింపు ప్రకటిస్తారా.. ? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సారి బడ్జెట్ మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎదురైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు రెట్టింపు చేయనున్నట్లు అంచనా.
ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. 2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వచ్చే ఆదాయానికి 5 శాతం పన్ను విధించబడుతుంది. అయితే గత ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీని ప్రకారం రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపులు సున్నా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక మినహాయింపు పరిమితిని కూడా రూ.5 లక్షల వరకు మాత్రమే కల్పించారు.
గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రకటించింది. అందులో పన్ను మినహాయింపు పూర్తిగా రద్దు చేసింది. అలాగే పన్ను స్లాబ్‌ను కూడా 6 విభాగాలుగా విభజించారు. ఇందులో 5శాతం, 10శాతం, 15 శాతం, 20 శాతం, 25శాతం, 30శాతం ఉన్నాయి. ఇక సున్నా నుంచి రూ.2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను రేటును సున్న శాతంగా నిర్ణయించింది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పన్ను రేటు 5 శాతంగా ఉండగా, ప్రస్తుతం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మినహాయింపులు విడుదల చేస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి. గత ఏడాది బడ్జెట్‌లో ప్రామాణిక తగ్గింపును రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. నిజానికి 2018 బడ్జెట్‌లో 40 వేల ప్రామాణిక తగ్గింపును జీతం పొందిన తరగతికి ప్రయోజనం కలిగేలా ప్రకటించింది కేంద్రం.
కరోనా మహమ్మారి కారణంగా వైద్య బీమా సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రీమియం చార్జ్ కూడా పెరిగింది. వైద్య బీమాను మినహాయింపును తొలగించడం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రామాణిక మినహాయింపును అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య బీమా కోసం పెరుగుతున్న డిమాండ్ పరంగా ఇందులో ఉపశమనం కల్పించనున్నట్లు అంచనా. ఈ సారి బడ్జెట్‌లో ప్రామాణిక తగ్గింపు పరిమితిని కూడా రూ.75వేలు లేదా లక్ష వరకు పెంచే అవకాశం ఉంది.