ఓటీటీల్లో అలాంటి కంటెంట్‌ని అనుమతించబోం: అనురాగ్ ఠాకూర్

సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉన్న కంటెంట్‌ని ప్రభుత్వం అనుమతించబోదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

By అంజి  Published on  19 July 2023 8:15 AM IST
OTT platforms, Indian culture, society, Anurag Thakur

ఓటీటీల్లో అలాంటి కంటెంట్‌ని అనుమతించబోం: అనురాగ్ ఠాకూర్

సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ఉన్న కంటెంట్‌ని ప్రభుత్వం అనుమతించబోదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం అన్నారు. అలాంటి సన్నివేశాలను ప్రసారం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటీటీ సంస్థలదే అన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఠాకూర్ మాట్లాడారు. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌ నియంత్రణ, యూజర్‌ అనుభవం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉల్లంఘనలకు శిక్షాస్పద నిబంధనలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, భారతదేశ మ్యాప్ యొక్క ఖచ్చితమైన వర్ణనకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం, డిజిటల్ పైరసీని ఎదుర్కోవడంపై కూడా చర్చలో కేంద్రీకృతమై ఉన్నాయని వారు తెలిపారు. ఓటీటీల ద్వారా పాశ్చాత్య ప్రభావం, భారతీయ సంప్రదాయాలను అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని మంత్రి ఎత్తిచూపారు. పక్షం రోజుల్లో వారి ప్రతిపాదిత పరిష్కారాలను రూపొందించాలని ప్రతినిధులను కోరారు. ఓటీటీ నిర్వహకులు తమ ప్లాట్‌ఫారమ్‌లను దుర్మార్గపు ప్రచారం, సైద్ధాంతిక పక్షపాతాల సాధనంగా ఉపయోగించవద్దని మంత్రి కోరారు.

ఇంకా మంత్రి మాట్లాడుతూ.. కంటెంట్‌ను వినియోగించే విధానంలో ఓటీటీలు విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయన్నారు. కొత్త ప్రతిభను పరిచయం చేశాయని, ప్రాంతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగాయన్నారు. భారత్‌ భిన్న జాతులు, వర్గాలు కలిగిన దేశం, దేశ గొప్పదనాన్ని ఓటీటీలు ప్రతిబింబించేలా ఉండాలి, అన్ని వయసుల వారు వీక్షించే విధంగా ఆరోగ్యకరమైన కంటెంట్‌ అందించాలి అని సూచించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ వెబ్‌సిరీస్‌లకు కేంద్రం అవార్డులు అందిస్తుందని తెలిపారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ‘బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌’ విభాగంలో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Next Story