చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. భార్యకు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఆమెకు అధికంగా ఆదాయం, ఆస్తులు ఉన్నాయని, భరణం ఇవ్వక్కర్లేదని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెంది వైద్య దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కోర్టు విచారణ జరిపి విడాకులు మంజూరు చేస్తూ భార్యకు భర్త నెలకు రూ.30 వేలు భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సదరు భర్త మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బాలాజీ విచారణ జరిపి తీర్పు వెల్లడించారు. పిటిషనర్ భార్యకు అధికంగా ఆస్తులు ఉన్నాయని జడ్జి గమనించారు. ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నట్టు తెలుపుతూ సంబంధిత పత్రాలను చూశారు. ఈ క్రమంలోనే పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.