పెళ్లైన నెలరోజులకే భర్తకు షాక్.. ప్రియురాలితో వెళ్లిపోయిన నవ వధువు
పెళ్లైన ఓ నెల తరువాత భార్య భర్తకు షాకిచ్చింది. తన ప్రియురాలితో కలిసి వెళ్లిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 12:13 PM ISTప్రేమ..ఎప్పుడు ఎవరి మధ్యన ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇద్దరు అమ్మాయిల మధ్య చిగురించిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఈ విషయం ఓ యువతి కుటుంబంలో తెలియడంతో ఆమెకు ఓ వ్యక్తితో నెలరోజుల క్రితం వివాహం చేశారు. అయితే అందరికి షాకిస్తూ ఆ యువతులు ఇద్దరూ పరారు అయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, అలీపూర్‌ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన మరో యువతి ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఈ విషయం తుఫాన్ గంజ్ ప్రాంతానికి చెందిన యువతి ఇంట్లో తెలిసింది.
వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు హడావుడిగా నెల రోజుల క్రితం ఓ యువకుడితో పెళ్లి చేశారు. అంతా సద్దుమణుగుతుందని, తమ కుమార్తె మరో యువతిని మరిచి పోయి భర్తతో సంసారం చేసుకుంటుందని బావించారు.
వివాహం జరిగిన నెల తరువాత ఆ యువతి బుధవారం తన భర్తను వదిలి తాను ప్రేమించిన చెలి వద్దకు వెళ్లిపోయింది. వీరిద్దరూ మాలా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ప్రశ్నించగా అసలు విషయం మొత్తం చెప్పారు. తాము ఇద్దరం మేజర్లమని, మా బంధాన్ని తల్లిదండ్రులు అంగీకరిస్తే ఇంటికి వెలుతాం. లేదంటే కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. వారి తల్లిదండ్రుల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.