'భార్య జీవిత భాగస్వామి.. సేవకురాలు కాదు'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆధునిక కాలంలో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా భార్యాభర్తల బాధ్యతలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
By - అంజి |
'భార్య జీవిత భాగస్వామి.. సేవకురాలు కాదు'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆధునిక కాలంలో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా భార్యాభర్తల బాధ్యతలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి పనులు, వంట చేయడం లేదా బట్టలు ఉతకడం వంటి గృహ సంబంధిత బాధ్యతలను కేవలం భార్య మాత్రమే నిర్వహించాలని ఆశించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహం చేసుకున్నది ఒక జీవిత భాగస్వామినే తప్ప, సేవకురాలిని కాదని గుర్తు చేస్తూ.. ఇలాంటి పనులన్నీ భార్య చేయకపోవడాన్ని భర్తపై జరిగే 'వేధింపులు'గా పరిగణించలేమని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసు ఒక ఉద్యోగ దంపతులకు సంబంధించినది. 2017లో వీరికి వివాహం కాగా, సంతానం కలిగిన తర్వాత మనస్పర్థల కారణంగా 2019 నుండి విడివిడిగా ఉంటున్నారు. తన భార్య ఇంటి పనులు, వంట సరిగా చేయడం లేదని, తద్వారా తనను మానసిక వేదనకు గురిచేస్తోందని భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, అక్కడ అతనికి విడాకులు మంజూరయ్యాయి.
అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టుకు వెళ్లడంతో, హైకోర్టు ఆ విడాకులను రద్దు చేసింది. దీనిపై భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. తొలుత ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ, అది విఫలమైంది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ధర్మాసనం, దంపతులిద్దరూ నేరుగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. వారితో స్వయంగా మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామని వెల్లడిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది.