'మోదీ మిత్ర' అంటే ఏమిటి?.. మైనార్టీలను ప్రలోభపెట్టడమే దీని లక్ష్యమా?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనారిటీలకు `మోదీ మిత్ర' సర్టిఫికెట్‌తో చేరువవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jun 2023 5:02 AM GMT'మోదీ మిత్ర' అంటే ఏమిటి?.. మైనార్టీలను ప్రలోభపెట్టడమే దీని లక్ష్యమా?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనారిటీలకు `మోదీ మిత్ర' సర్టిఫికెట్‌తో చేరువవుతోంది. ఈ కార్యక్రమం కింద, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పని పట్ల సంతోషించిన మైనారిటీలకు ఈ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో దాదాపు 150 సర్టిఫికెట్లు పంపిణీ చేయబడ్డాయి.
మోడీ మిత్ర అంటే ఏమిటి?
ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిని నమ్మే మైనారిటీలకు ఇచ్చే సర్టిఫికేట్. భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుడు, తెలంగాణలోని బీజేపీ మైనారిటీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు హనీఫ్ అలీ దీని గురించి వివరించారు. “ఈ సర్టిఫికేట్లు మైనారిటీలకు సమావేశాలలో జారీ చేయబడుతున్నాయి. ఇది దేశంలోని మైనారిటీలందరికీ చేరువయ్యే కార్యక్రమం. దీని అర్థం ముస్లింలు మాత్రమే కాదు, క్రైస్తవులు, సిక్కులు, ఇతర వర్గాలకు కూడా చేరువ అవుతున్నారు. ప్రధాని మోదీ పనిని ఇష్టపడి, భారతదేశం కోసం ఆయన చేస్తున్న పని పట్ల సంతోషంగా ఉన్న వారికి ఈ సర్టిఫికెట్లు ఇస్తారు''
ఈ సర్టిఫికేట్ గ్రహీతలు వారి రాజకీయ ఒరవడితో సంబంధం లేకుండా ప్రధాని విధానాలకు మద్దతు ఇచ్చినందుకు ఎంపిక చేయబడతారని ఆయన అన్నారు. మొదట ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించబడింది. ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అనుసరించబడుతోంది.
మైనార్టీ ఓట్లను చీల్చే ప్రయత్నమా?
బీజేపీ ఈ కసరత్తు పక్కా ప్రణాళికతో సాగుతోంది. కొంత మంది బీజేపీ పార్టీతో సంతోషంగా లేరని, మోడీతో సంతోషంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఈ కార్డుకు ‘మోదీ మిత్ర’ అని పేరు పెట్టారు. ఈ ఆలోచన చాలా స్పష్టంగా ఉందని, మైనార్టీ ఓట్లను చీల్చేందుకు సూక్ష్మ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నమని ఓ రాజకీయ విశ్లేషకుడు వివరించారు.
''ఈ వ్యూహం రెండు కోణాలను చూపించడమే - ఒకటి మైనారిటీలో ఒక వర్గం మోడీతో సంతోషంగా ఉంది. ఇతరులను ప్రభావితం చేయగలదు. కర్నాటక ఎన్నికల మాదిరిగానే ముస్లిం సామాజికవర్గంలో కూడా బీజేపీకి ఓటేసిన వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ పద్ధతిలో వ్యాపార ప్రయోజనాలు ఉన్నవారు లేదా మోడీ పనిని నమ్మేవారు ఆయనకు మద్దతు ఇవ్వగలరు. దీంతో మైనార్టీల ఓట్లు అట్టడుగు స్థాయిలో చీలిపోతాయి. ఇది మైనారిటీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న ప్రతిపక్ష పార్టీల అవకాశాలను దెబ్బతీస్తుంది'' అని ఆయన అన్నారు.
వారి విధేయతను కాపాడుకునే ప్రయత్నం
మైనారిటీల పార్టీ పట్ల విధేయతను కాపాడుకోవడానికి ఈ సర్టిఫికేట్ కసరత్తుగా కనిపిస్తోంది. మైనారిటీ విభాగంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తరగతులు, గిరిజనులు, మహిళలు, యువత కూడా ఉన్నారు. వీటన్నింటిని వివిధ కమిటీల గ్రౌండ్ వర్కర్లు దశలవారీగా చేరవేస్తారు. దీని ద్వారా విధేయతను పొంది, వారి నిబద్ధతను ఓట్లుగా మార్చుకోవాలని పార్టీ భావిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను తమ ఐకాన్‌గా పిఎం నరేంద్ర మోడీతో కలిసి బీజేపీ పోరాడుతుంది. మరీ మైనారిటీలు మోడీ మిత్రను పట్టించుకుంటారా?