అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో వినియోగించేందుకు ప్రపంచ దేశాల నుంచి పవిత్ర జలాలను సేకరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ జాలీ ఆధ్వర్యంలో ఢిల్లీ స్టడీ గ్రూప్ ఎన్జీవో పవిత్ర జలాలను సేకరిస్తోంది. తాజాగా 115 దేశాల్లోని నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్బర్ రోడ్డులోని తన నివాసంలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామజన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, డెన్మార్క్, నైజిరీయా, ఫిజీతో పాటు పలు దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు
భూమిపై ఉన్న ఏడు ఖండాల్లోని 192 దేశాల నుంచి సేకరించే పవిత్ర జలాలను రామమందిర నిర్మాణంలో, రాముడి అభిషేకానికి వినియోగించనున్నారు. ప్రపంచ దేశాల నుండి పవిత్ర జలాలను సేకరించాలన్న ఆలోచన.. వసుదైక కుటుంబానికి అద్దంపట్టేలా ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మిగతా దేశాల నుంచి కూడా పవిత్ర జలాల సేకరణ జరుగుతుందని అన్నారు. రామమందిర నిర్మాణం పూర్తయ్యేనాటికి మిగతా దేశాల్లో పవిత్రజలాలు భారత్‌కు రానున్నాయని వివరించారు.