బిగ్‌బాస్ హౌస్‌లోకి వరద నీరు.. కంటెస్టెంట్ల కళ్లకు గంతలు కట్టి హోటల్‌కు తరలింపు..!
Water flowing into the Big Boss House .. తమిళనాడును నివర్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుపాన్ ప్రభావంలో
By సుభాష్ Published on 27 Nov 2020 7:20 PM IST
తమిళనాడును నివర్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుపాన్ ప్రభావంలో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నైలోని పలు భవనాలు నీట మునిగాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవు ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో బిగ్‌బాస్ సీజన్ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. నివర్ ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ మీద కూడా పడింది. బిగ్ బాస్ హౌస్ ను వరద ముంచెత్తినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఉంటున్న గదుల్లోకి భారీగా వరద నీరు వచ్చేసిందట. వెంటనే స్పందించిన బిగ్‌బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లను ఇంటి నుంచి రహస్యంగా ఓ హోటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
భారీ వర్షాలకు చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి చేరింది. ఈ పరిస్థితిని చూసి హౌస్‌లోని కంటెస్టెంట్లు భయంతో వణికిపోయారు. బిగ్‌బాస్ నిర్వాహకులతో తమను వేరే చోటికి తరలించాలని కోరడంతో.. ఇంటి సభ్యుల కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్టు సమాచారం. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు మాట్లాడకుండా వేర్వేరు వాహనాల్లో హోటల్ కు తరలించారట. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లోని వరద నీటిని బయటకు తోడేశారు. గదులను శుభ్రపరిచారు. ఇందుకోసం దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట.
అనంతరం ఇంటి సభ్యులను మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి నీళ్లే రాలేదని చెప్పుకొచ్చారు. కేవలం ఓ టాస్క్ లో భాగంగానే తాము ఇంటి సభ్యులను హోటల్ కు తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం. ఇక తుఫానులో కొంతభాగం ఇంకా సముద్రంలోనే కేంద్రీకృతమై ఉందని, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి ట్విట్టర్‌లో పేర్కొంది.