విషాదం : మాక్ డ్రిల్‌లో వాలంటీర్ మృతి.. విచారణకు ప్రభుత్వం ఆదేశం
Volunteer’s death during mock drill.మాక్ డ్రిల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2022 8:33 AM ISTవరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందం సంసిద్ధతను అంచనా వేయడంలో భాగంగా గురువారం పతనంతిట్ట జిల్లాలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. అయితే.. మాక్ డ్రిల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన పై ప్రభుత్వం శుక్రవారం విచారణకు ఆదేశించింది.
పతనంతిట్ట జిల్లాలోని కీజ్‌వాయిపూర్ సమీపంలోని మణిమాల నదిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్వహించిన మాక్ డ్రిల్‌లో వాలంటీర్‌గా పాల్గొన్న బిను సోమన్ (34) మునిగి చనిపోయాడు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీపీ జాయ్‌కి ఆదేశాలు జారీ చేసినట్లు సీఎంఓ తెలిపింది.
పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ సీఎం ఆదేశాల మేరకు ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించారు.
అంతకన్నాముందు.. మానవ హక్కుల కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (KSHRC) ఈ విషాద మరణంపై కేసు నమోదు చేసింది. సంఘటనపై రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) జిల్లా కలెక్టర్ ల నుంచి నివేదికను కోరింది. ఇందుకు 15 రోజుల సమయాన్ని ఇచ్చింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
మాల్‌డ్రిల్ నిర్వహణ సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, రెస్క్యూ సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే.. చనిపోయిన వ్యక్తిని రక్షించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తి చనిపోవడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.