జయలలిత సమాధి వద్ద కంటతడి పెట్టిన చిన్నమ్మ
VK Sasikala gets Emotional.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ బావోద్వేగానికి లోనయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 8:42 AM GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ బావోద్వేగానికి లోనయ్యారు. శనివారం చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్ స్మారకాల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆమె బావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టుకున్నారు. కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మకు పుష్పాంజలి ఘటించారు. అంతకముందు వందలాది మంది అనుచరులతో కారుపై అన్నాడీఎంకే జెండాతో స్మారకాల వద్దకు వచ్చారు.
కాగా.. కారుపై అన్నాడీఎంకే జెండాను ఉపయోగించడంతో ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురై వ్యక్తి.. పార్టీ జెండాను ఉపయోగించడానికి వీల్లేదని.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల క్రితం జైలుకు వెళ్లే సందర్భంలో అమ్మ సమాధి వద్దకు వచ్చిన శశికళ శపథం చేసిన సంగతి తెలిసిందే. మూడు సార్లు జయ సమాధిపై చేతితో గుద్ది.. తన పరిస్థితికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. జైలు నుంచి విడుదలైన తరువాత అమ్మ సమాధిని చూసేందుకు శశికళకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి మరీ అమ్మ సమాధి వద్దకు వచ్చారు చిన్నమ్మ.
గత మార్చిలో క్రియాశీల రాజకీయాలకు స్వస్తిపలికిన శశికళ.. ఇప్పుడు మనసు మార్చుకుని మళ్లీ ప్రజా జీవితంలోకి అడుగుపెడతారా..? లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 17 కి అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 ఏళ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.