తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే మాజీ మధ్యంతర ప్రధాన కార్యదర్శి వి.కె. శశికళ తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అత్యంత ఆప్తురాలు వి.కె. శశికళ శుక్రవారం (మార్చి 13, 2026) చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో తన పార్టీ పేరును వెల్లడించారు. ఆమె పార్టీని ఇకపై 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం' అని పిలుస్తారని ప్రకటించారు.
ఈ పార్టీకి చిహ్నంగా 'కొబ్బరి తోట' గుర్తును కేటాయించినట్లు శశికళ తెలిపారు. సమావేశంలో ఆమె తన పార్టీ గుర్తు ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు. ఎంజీఆర్, జయలలిత అనుచరుడు ఒకరు ఈ పార్టీని స్థాపించారని, తాను అందులో చేరినట్లు ఆమె స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24న రామనాథపురం జిల్లా కముతిలో జరిగిన బహిరంగ సభలో ఆమె ఇప్పటికే పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాన ఆలోచనలు ఉన్న పార్టీలతో తమ సంస్థ పొత్తు పెట్టుకుంటుందని ఆమె వెల్లడించారు. మరోవైపు, నామ్ తమిళర్ కట్చి లో కీలక నేతగా ఉన్న కాళీయమ్మల్ శుక్రవారం ఏఐఏడీఎంకేలో చేరారు. చెన్నైలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.