Tamilnadu polls: రెండు చోట్ల నుండి విజయ్ పోటీ.. టీవీకే అభ్యర్థుల లిస్ట్ విడుదల
తమిళనాడు రాజకీయాల్లో తన తొలి అంకాన్ని ప్రారంభిస్తూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు.
By - అంజి |
Tamilnadu polls: రెండు చోట్ల నుండి విజయ్ పోటీ.. టీవీకే అభ్యర్థుల లిస్ట్ విడుదల
తమిళనాడు రాజకీయాల్లో తన తొలి అంకాన్ని ప్రారంభిస్తూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చెన్నైలోని పెరంబూర్ , తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుండి "సి. జోసెఫ్ విజయ్" అనే పేరుతో తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి, రాష్ట్రవ్యాప్త అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తన కోర్ టీమ్‌లోని నమ్మకస్తులైన ఎన్. ఆనంద్ (టి. నగర్), వెంకట్ రామన్ (మైలాపూర్), ఆధవ్ అర్జున (విల్లివాక్కం) వంటి వారికి కీలక స్థానాలు కేటాయించారు.
ఈ ఎన్నికల పోరు కేవలం తమకు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మధ్యేనని విజయ్ స్పష్టం చేశారు. అధికార కూటమిని "ప్యాచ్-అప్" (సర్దుబాటు) కూటమిగా విమర్శిస్తూ, తమ అభ్యర్థులు సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన వారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం నెలకు ₹4,000 భృతి, డిప్లొమా హోల్డర్లకు ₹2,500 సాయం వంటి హామీలను ప్రకటించారు. అలాగే, 75 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చే ప్రైవేట్ కంపెనీలకు పన్ను రాయితీలు కల్పిస్తామని 'తమిళ ఎంప్లాయిమెంట్ క్రెడిట్ సిస్టమ్'ను ప్రతిపాదించారు.
అవినీతి రహిత పాలన, మహిళల భద్రత, మరియు డ్రగ్స్ లేని తమిళనాడును నిర్మిస్తామని విజయ్ ఓటర్లకు వాగ్దానం చేశారు. "నేను మీ కోసం సమస్తం వదిలి వచ్చాను, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి" అని కోరుతూ, టీవీకే పార్టీ గుర్తు అయిన 'విజిల్' (Whistle) కు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి వేరు, విజయ్ వేరు కాదని.. అందరి జవాబుదారీతనం ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు. ఏప్రిల్ 23న జరగనున్న 234 స్థానాల ఎన్నికల సమరంలో విజయ్ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.